ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఫైర్
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:55 AM
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అనేక సంచలన కేసులకు సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను నిగ్గుతేల్చే తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్) భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
మొదటి అంతస్తులో అగ్నికీలలు హార్డ్ డిస్క్‌లు, కీలక ఫైళ్లు అక్కడే
ఐదు ఫైరింజన్లతో అదుపులోకి మంటలు.. షార్ట్ సర్క్యూట్‌తో నిప్పు?
తొలి అంతస్తులో సామగ్రి అంతా సురక్షితం: ఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్
ఓటుకు నోటు కేసు ఆధారాలు ధ్వంసమయ్యే చాన్స్: కేటీఆర్
ఇది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కుట్ర: రాంచందర్‌రావు
మంగళ్‌హాట్/హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అనేక సంచలన కేసులకు సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను నిగ్గుతేల్చే తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్) భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఎఫ్‌ఎ్‌సఎల్‌లోని మొదటి అంతస్తు అగ్నికీలల్లో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు, గ్యాంగ్‌స్టర్ నయీం తదితర సంచలన కీలక కేసులకు సంబంధించిన పత్రాలు అగ్ని ప్రమాదం సంభవించిన భవనంలోనే ఉన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఆఫీసు బాయ్ కృష్ణ అప్రమత్తం చేయడంతో సిబ్బంది సురక్షితంగా భవనం నుంచి బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. నాంపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. తొలుత మంటలను ఆర్పేందుకు ఆఫీసు బాయ్ కృష్ణ ప్రయత్నించాడు. అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 40కి పైగా కంప్యూటర్లు, క్లూస్ టీమ్స్ ేసకరించిన సాంకేతిక ఆధారాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. అగ్ని ప్రమాదంలో హార్డ్ డిస్క్‌లు, కొన్ని పత్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఎన్ని పూర్తిగా, ఎన్ని పాక్షికంగా కాలిపోయాయనేది తేలాల్సి ఉందన్నారు.
స్వర నమూనాల విశ్లేషణలకు సిడార్ సహా పలు విదేశాల నుంచి తెప్పించిన కీలక పరికరాలకు ఎంత మేర నష్టం జరిగింది? వాటికి బీమా చేయించారా? అన్న విషయంలో స్పష్టం లేదు. అయితే ప్రమాదం జరిగిన తొలి అంతస్తులో సామగ్రి అంతా సురక్షితంగా ఉందని ఎఫ్‌ఎ్‌సఎల్ డైరెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధారాలు లేని, నిర్ధారణ జరగని వార్తలు ప్రసారం చేయొద్దని సూచించారు. మంటలు మధ్యాహ్నం 1:30 గంటలకు అదుపులో వచ్చాయని వెల్లడించారు. ఫొరెన్సిక్ కంప్యూటర్ ల్యాబ్, ట్రెయినింగ్ హాల్‌తో పాటు మొదటి అంతస్తులోని సదుపాయాలకు మాత్రమే నష్టం జరిగిందని వివరించారు. ప్రమాదంపై ఆధార రహిత, నిర్ధారణ జరగని వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. కాగా ఎఫ్‌ఎ్‌సఎల్ భవనంలో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. రాష్ట్రం విడిపోక ముందు ఎఫ్‌ఎ్‌సఎల్ భవనంలో ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా సరిగ్గా ఇదే తరహాలో మొదటి అంతస్తులో భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలు దగ్ధమయ్యాయి. విశ్లేషణలకోసం భద్రపరిచిన పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడంతోనే అప్పట్లో ప్రమాదం జరిగింది. గతంలో మాదిరిగానే ఈసారి మొదటి అంతస్తులోనే ప్రమాదం జరగడం గమనార్హం.
సకాలంలో మంటలను అదుపు చేశాం
‘తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో మంటలంటుకున్నట్లు ఉదయం 10 గంటలకు సమాచారం అందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోనే నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ ఆపరేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఫైల్స్ కాలిపోయాయనేది స్పష్టత లేదు. వార్డు బాయ్ కృష్ణకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించాం. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో నలుగురు సిబ్బంది ఉన్నారు. అప్రమత్తంగా వ్యవహరించి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది’ అని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ‘తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలోని మొదటి అంతస్తులో అనేక కేసులకు సంబందించి సీజ్డ్ ప్రాపర్టీ ఉంది. శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో విలువైన కంప్యూటర్ హర్డ్ డిస్కులు కాలిపోయాయి. ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశాం. రెండో అంతస్తులో కెమికల్ లేబొరేటరీకి విస్తరిస్తే ఊహించని పెను ప్రమాదం సంభవించేది. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు’ అని డీఎఫ్‌వో శ్రీరామ్ దాస్ తెలిపారు.
ఫైళ్ల దగ్ధం వాస్తవం కాదు: డీజీపీ
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రతి ఫైల్‌కు డేటా బ్యాక్‌అప్ ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అక్కడ జరిగింది కేవలం ఒక అగ్ని ప్రమాదమేనన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కీలక ఫైళ్లన్నీ దగ్థం అయినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు., వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేయరాదని విజ్ఞప్తి చేశారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్నారు.
సీఎంవో ఆరా
ఎఫ్‌ఎ్‌సఎల్‌లో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరా తీసింది. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలు? ప్రమాదంలో ఏ సమాచారం దగ్ధమైంది? అసలు అక్కడ భద్రపరిచిన ఆధారాలు, నివేదికలు ఏమిటి? అన్న విషయాలను సీఎంవో అధికారులు ఎఫ్‌ఎ్‌సఎల్, పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీశారు అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంతోపాటు ఆధారాల నష్టంపైనా అంచనా వేసే పనిలో పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.
కప్పిపుచ్చేందుకే: కేటీఆర్
ఎఫ్‌ఎ్‌సఎల్‌లో అగ్నిప్రమాద ఘటనపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడంతో ఈ విధంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.