ఉన్నత విద్యామండలి చైర్మన్ పేరుతో వసూళ్లు!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:43 AM
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పేరుతో ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాపై కేసు నమోదైంది.
పలు ఇంజనీరింగ్ కాలేజీలకు ఓ ముఠా ఫోన్లు
బాలకిష్టారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు..
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పేరుతో ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాపై కేసు నమోదైంది. ఆయా కాలేజీల ఇచ్చిన సమాచారం మేరకు బాలకిష్టారెడ్డి.. సోమవారం డీజీపీతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన నాంపల్లి పోలీ్‌సస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. డీమ్డ్ వర్సిటీల కోసం దరఖాస్తు చేసుకున్న పలు ఇంజనీరింగ్ కాలేజీలకు కొందరు ఫోన్లు చేసి.. ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, అనుమతులివ్వాలంటే డబ్బులు పంపాలని అడిగారు. ఈ విషయాన్ని రెండు కాలేజీలు నేరుగా బాలకిష్టారెడ్డికి దృష్టికి తీసుకెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన.. తన పేరుతో ఎవరైనా డబ్బుల కోసం ఫోన్ చేస్తే వారి వివరాలు పంపాలంటూ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించారు. దీంతో మరిన్ని కాలేజీలు కూడా ముందుకొచ్చాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీలకు కావాల్సిన అనుమతులిస్తామని చైర్మన్ బాలకిష్టారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా డబ్బులడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని కోరారు.