11మంది ఐడీపీఎల్ జీఎం, అధికారులపై కేసు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:09 AM
ఐడీపీఎల్ భూముల ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు...
భూముల ఆక్ర మణపై ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదు
ఈ భూముల ఆక్రమణపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు
హైదరాబాద్, జనవరి 22(ఆంధ్ర జ్యోతి): ఐడీపీఎల్ భూముల ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. భూ ఆక్రమణను అడ్డుకోవాలని సంస్థ ఉద్యోగులు 2017 నుంచి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ‘రూ.4,000 కోట్ల ఐడీపీఎల్ భూములు కృష్ణార్పణం’ అనే శీర్షికన గతేడాది డిసెంబరు 11న ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులకు సహకరించిన 11 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అనూరాఽధ ఈ నెల 17న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 342/2, 343/2, 347/2, 345/2 పరిధిలోని 14.29 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదులో ఐడీపీఎల్ జీఎం వై. రామకృష్ణారెడ్డి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్ ్స) ఎం.రాజ్‌కుమార్, ఎన్‌ఐపీఈఆర్ ఏవో మనోజ్ దోతే, ఇన్‌చార్జి రిజిస్ర్టార్ బి.లక్ష్మి, డీన్ శ్రీనివాస్, ఆర్డీవో కార్యాలయంలో డీఐ శ్రీనివాసాచారి, కుత్బుల్లాపూర్ మండల సర్వేయర్ జ్యోతి, ఐడీపీఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (పర్సనల్) ఎన్. విజయ్‌కుమార్, ఎన్‌ఐపీఈఆర్ ఎస్టేట్ సెక్యూరిటీ అధికారి కైలాష్, మహ్మద్ ముజీబ్ ఖాన్, సయ్యద్ ముసీహుల్లా పేర్లను చేర్చారు. మొదట ఈ ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులు.. ఆంధ్రజ్యోతిలో దీనిపై వరుస కథనాలు రావటంతో ఎఫ్‌ఐఆర్ నమోదుచేయక తప్పలేదు. ఐడీపీఎల్, నైపర్ అధికారులతోపాటు ఆక్రమణకు పాల్పడిన వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.