ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మృతి..!
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:23 AM
ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్‌కు వెళ్లి దాదాపు 65 రోజుల క్రితం అదృశ్యమైన మణిదీ్‌పరెడ్డి (18) మృతిచెందినట్లు ఆ దేశ పోలీసులు ప్రకటించారు.
65 రోజుల క్రితం మణిదీప్ అదృశ్యం
తాజాగా మృతదేహం లభించినట్లు పోలీసుల ప్రకటన
అది తమ కొడుకు మృతదేహం కాదని తల్లిదండ్రుల వాదన
వనస్థలిపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్‌కు వెళ్లి దాదాపు 65 రోజుల క్రితం అదృశ్యమైన మణిదీ్‌పరెడ్డి (18) మృతిచెందినట్లు ఆ దేశ పోలీసులు ప్రకటించారు. సముద్రంలో మణిదీప్ మృతదేహం లభ్యమైనట్లు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, మణిదీప్‌అదృశ్యం, మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం శేరిగూడకు చెందిన గుజ్జ ముత్యం రెడ్డి, మమత దంపతుల కుమారుడు మణిదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఆగస్టు 21, 2025లో ఫిన్లాండ్ వెళ్లి, లతి పట్టణంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటీలో చేరాడు. ఈ ఏడాది మే 4న కుటుంబ సభ్యులతో చివరిసారి ఫోన్‌లో మాట్లాడాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. దీంతో మే 9న అక్కడి పోలీసులకు మణిదీప్ రెడ్డి స్నేహితులు ఫిర్యాదు చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో కూడా సమాచారమిచ్చారు. అప్పటి నుంచి ఫిన్లాండ్ పోలీసులు వెదుకుతూనే ఉన్నా.. మణిదీప్ జాడ తెలియలేదు. సత్వర విచారణ కోసం మణిదీప్ కుటుంబం తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించింది. తాజాగా ఉన్నట్లుండి ఈ నెల 9న ఫిన్లాండ్‌లోని కృనువు ఓరెంటాన్ సముద్ర తీరంలో మణిదీప్ రెడ్డి మృతదేహం లభించినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. అయితే, మణిదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఆ మృతదేహం తమ కుమారుడిది కాదని వాదిస్తున్నారు. మే 5న అదృశ్యమైన వ్యక్తి 65 రోజుల తర్వాత సముద్రంలో ఎలా దొరుకుతాడని ప్రశ్నిస్తున్నారు. అ మిస్సింగ్ కేసును మూడువారాల్లో తేల్చాలని అక్కడి కోర్టు ఆదే శించటంతో గుర్తు తెలియని మృతదేహాన్ని చూపించి తన కుమారుడిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మణిదీప్ తండ్రి ముత్యం రెడ్డి వాపోయారు. ఈ కేసులో ఫిన్లాండ్ పోలీసుల తీరు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు.