Share News

ఏటీఎంకు తాడు కట్టి.. బొలెరోతో లాగి..

ABN , Publish Date - May 27 , 2026 | 05:23 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు సినిమా స్టైల్‌లో ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి..

ఏటీఎంకు తాడు కట్టి.. బొలెరోతో లాగి..

  • మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగతనం

మహబూబ్‌నగర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు సినిమా స్టైల్‌లో ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బొలెరో వాహనంలో వచ్చిన దొంగల్లో ఒకడు మొదట ఏటీఎంలోని సీసీ కెమెరాలు, కరెంటు వైర్లను కట్‌ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఏటీఎం మిషన్‌కు తాడు కట్టి దాని మరో చివరను బొలెరోకు కట్టారు. బొలెరో వాహనాన్ని వేగంగా ముందుగు పోనివ్వగా ఏటీఎం యంత్రం అమాంతం ఊడి వచ్చేసింది. ఆ వేగానికి ఏటీఎం తలుపు కూడా విరిగిపడిపోయింది. వెంటనే ఆ ఏటీఎం మిషన్‌ను బొలెరో ట్రాలీలో ఎక్కించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా 9నిమిషాల్లో జరిగిపోయింది. దొంగతనం దృశ్యాలన్నీ ఏటీఎం ఎదుట ఉన్న సూపర్‌ మార్కెట్‌ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఏటీఎంను పగులగొట్టి డబ్బును తీసుకున్న దుండగులు..ఆ మిషన్‌ను అక్కడే పడేశారు. వేలిముద్రలు దొరక్కుండా దాన్ని కాల్చేసేందుకు ప్రయత్నించారు. ఏటీఎంలో రూ.2,37,500 పోయినట్లు ఎస్బీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌లో ఈనెల 23న ఇదే తరహాలో బొలెరో వాహనంతో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో, ఈ రెండు దొంగతనాలు ఒకే ముఠా పని అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్యానాకు చెందిన ముఠా ఈ దొంగతనాలు చేసినట్లు భావిస్తున్నారు.

Updated Date - May 27 , 2026 | 05:23 AM