Share News

కార్పొరేట్‌ శక్తులపై కలిసి పోరాడుదాం

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:26 AM

మతం అనే సెంటిమెంట్‌తో ప్రస్తుతం దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను పక్కదోవ పట్టించి.. ప్రజాస్వామ్యానికి సవాళ్లు విసురుతున్న కార్పొరేట్‌ శక్తులకు వ్యతికంగా కలిసి పోరాటలు చేద్దామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క...

కార్పొరేట్‌ శక్తులపై కలిసి పోరాడుదాం

  • ఆ శక్తులు ప్రజాస్వామ్యానికి సవాళ్లు విసురుతున్నాయి

  • సీపీఐ జాతీయ సెమినార్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి

ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మతం అనే సెంటిమెంట్‌తో ప్రస్తుతం దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను పక్కదోవ పట్టించి.. ప్రజాస్వామ్యానికి సవాళ్లు విసురుతున్న కార్పొరేట్‌ శక్తులకు వ్యతికంగా కలిసి పోరాటలు చేద్దామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌కు భట్టివిక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఐక్యపోరాటాల ద్వారా అడ్డుకట్ట వేద్దామని, దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్టుల పాత్ర ప్రముఖమైందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ముఖ్యనేతలు ఖమ్మంలో ఒకే వేదికపై కలవడం, ఈ సెమినార్‌ నిర్వహించడం హర్షణీయమన్నారు. వందేళ్ల సీపీఐ చరిత్ర ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు ఎదుర్కొందని నాటి బ్రిటిష్‌ పోరాటంతో పాటు నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం దున్నేవాడిదే భూమి అని భూస్వాములకు వ్యతిరేకంగా భూపోరాటం పేదల హక్కుల కోసం పోరాటాలతో పాటు గ్రంథాలయ ఉద్యమం, ఇలా ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. వామపక్షాల సాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ దేశంలో, రాష్ట్రంలో పలుసార్లు అధికారంలోకి రాగలిగాయని, ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో పాటు లౌకిక పార్టీలపైనా ఉందని లేని పక్షంలో సామాన్యుల హక్కులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 05:26 AM