Share News

kumaram bheem asifabad- పండుగ పూట.. ధరల మంట

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:22 PM

ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసరాల ధరలు పేద, మధ్య తరగతి వారిని హడలెతిస్తున్నాయి. నాలుగు నెలల కిందటి వరకు అందుబాటులో ఉన్న ఽసరుకులు ఇప్పుడు చుక్కలు తాకుతుండడంతో ప్రతి నెలా ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. స్వల్ప వ్యవదిలోనే బియ్యం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం, డిమాండ్‌ మేరకు సరకులు రాకపోవడంతో వ్యాపారులు సైతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు

kumaram bheem asifabad- పండుగ పూట.. ధరల మంట
లోగో

- సన్నబియ్యం ధరలకు రెక్కలు

- క్వింటాల్‌కు రూ.1,500లకు పైగా పెరుగుదల

- పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు

బెజ్జూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసరాల ధరలు పేద, మధ్య తరగతి వారిని హడలెతిస్తున్నాయి. నాలుగు నెలల కిందటి వరకు అందుబాటులో ఉన్న ఽసరుకులు ఇప్పుడు చుక్కలు తాకుతుండడంతో ప్రతి నెలా ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. స్వల్ప వ్యవదిలోనే బియ్యం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం, డిమాండ్‌ మేరకు సరకులు రాకపోవడంతో వ్యాపారులు సైతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు మొదలుకొని నూనెలు, పప్పుల ధరలు ఆకాశన్నంటడంతో పండుగలు ఎలా చేసుకునేదని సామాన్య జనం వాపోతున్నారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో మార్కెట్‌లో ధరలు హడలెత్తిస్తున్నాయి. వంటింటి సరకుల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటం పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు ముఖం చాటేయడంతో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం అన్ని రకాల వస్తువులపై పడటం, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందోనని ఇప్పటి నుంచే ఆందోళన మొదలవుతోంది.

- నెల రోజుల వ్యవధిలో..

నెల రోజుల వ్యవధిలో సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు రూ.1,500లకు పైగా పెరిగాయి. ఎల్‌నినో కారణంగా ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసిన తొలినాళ్లలో సన్నబియ్యం ధరలు దిగివచ్చాయి. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాలు తక్కువగా కురవడం, ఎల్‌నినో కారణంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. దానితో పాటు రేషన్‌ బియ్యాన్ని చాలా మంది తినడం లేదు. దీంతో నాణ్యమైన సన్నబియ్యానికి డిమాండ్‌ ఏర్పడింది. నెల రోజులకు ముందు హెచ్‌ఎంటీ బి య్యం ధర క్వింటాల్‌కు రూ. 6,000-6,300గా ఉండేది. జైశ్రీరాం బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6, 800-7,000లుగా పలికింది. ఇప్పుడు హెచ్‌ఎంటీ ధర రూ.7,600-7,800కు చేరింది. అదే జైశ్రీరాం క్విం టాల్‌ ధర రూ. 8,400-8,600లకు పెరిగింది. సాంబమసూరి ధర క్వింటాల్‌కు గతంలో రూ.5,000 ఉం డగా ప్రస్తుతం రూ.7,000లకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు కూడా ప్రస్తుత సమయానికే నని విక్రయదారులు చెబుతున్నారు. త్వరలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

- కూరగాయలు మొదలుకొని..

కూరగాయలు మొదలుకొని పప్పుధాన్యాలు, నూనెల ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతోంది. కూరగాయలు ఏ రకమైన కిలోకు రూ.80కి పైగా పలుకుతోంది. వారానికి సరిపడా కొంటే రూ.500లకు పైగా ఖర్చువుతోందని ప్రజలు వాపోతున్నారు. అల్లం, ఉల్లి, వెల్లుల్లి ఇలా వంటింట్లో వినియోగించే ధరలు ఒక్కసారిగా పెరగడం సామాన్యులకు భారంగా మారింది. కిలో చిక్కుడుకాయ ధర రూ. 160, మెంతికూర రూ.200, బీర రూ.50, పచ్చిమిర్చి రూ.120, సిమ్లా మిర్చి రూ.100, బెండకాయ రూ.80, గోబి రూ.80, టమాట రూ.50, ఉల్లి రూ.80, వెల్లుల్లి రూ.200 పలుకుతోంది. దీంతో వచ్చే దసరా దీపావళి పండుగలు ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పప్పు ధరల విషయానికొస్తే గతంలో కందిపప్పు 140ఉండగా, ప్రస్తుతం 160పలుకుతోంది. పెసరపప్పు100-120, శనగపప్పు 80-100, చక్కెర ధర 55-60లు పెరగడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు.

- నియంత్రణపై దృష్టి పెడితే..

బియ్యం ధరలపై ప్రభుత్వంతో పాటు ధరల నియంత్రణ కమిటీలు కూడా కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. కేవలం 50రోజుల్లోనే ధరలు ఈ విధంగా పెరిగిపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సన్న బియ్యాన్ని రహస్యంగా నిల్వ చేసుకొని అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ధరలను నియంత్రించి సామాన్య జనంపై భారం పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Oct 15 , 2026 | 10:22 PM