kumaram bheem asifabad- ఎరువు.. దరువు
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:38 PM
వరుస ఇబ్బందులతో తల్లడిల్లుతున్న రైతులపై పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా మారింది. ఈ వానాకాలం సీజన్ నుంచే ఎరువుల కంపెనీలు తమ ఇష్టాను సారంగా ధరలను పెంచేశాయి. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరురుల ధరలు విపరీతంగా పెరిగాయి.
- ఆందోళనలో అన్నదాతలు
- బస్తాకు రూ. 400 నుంచి 500 వరకు పెంపు
- పెరిగిన సాగు పెట్టుబడి వ్యయం
- జిల్లాలో 4.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
చింతలమానేపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వరుస ఇబ్బందులతో తల్లడిల్లుతున్న రైతులపై పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా మారింది. ఈ వానాకాలం సీజన్ నుంచే ఎరువుల కంపెనీలు తమ ఇష్టాను సారంగా ధరలను పెంచేశాయి. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరురుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎరువుల ధరల నియంత్రణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు గత్యంతరం లేక ఎఝ్కువ ధరలకే కొనాల్సి వస్తున్నది. గత వానాకాలం నుండి ఇప్పటి వరకు ఆయా కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులను ఏకంగా నాలుగు సార్లు పెంచేశాయి. దీంతో వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యూరియా, డీఏపీ తర్వాత రైతులు ఎక్కువగా కాంప్లెక్స్, పొటాషియం ఎరువులను పంటలపై ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి అత్యవసరం కావడం తో ఎక్కువ ధర చెల్లించి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే ఆసరాగా చేసేకుంటున్న ఎరువుల వ్యాపారులు మరింత ధరలను పెంచి రైతులకు అంటగడుతు న్నట్లు ఆరోపణలున్నాయి. రైతు లను వ్యవసాయ డీలర్లు మోసం చేస్తూ యూరియా, డీఏపీ ధరలతో పాటు కాంప్లెక్స్, పొటాషియం వంటి వాటిపై ధరలను అధిక మొత్తంలో అమ్ముతున్నట్లు జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారుగా 4.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. దీని కోసం సుమారుగా 80 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియో గించే అవకాశం ఉంటుంది. ఇందులో యూరియా 36 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 16వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22 వేల టన్నులు, పొటాష్ 10వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని సుమారుగా అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం యూరియా కష్టాలు మరో వైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు లాంటి వ్యవహారాలు రైతులకు సవాలుగా మారుతున్నాయి.
- రైతుల బెంబేలు..
ఎరువుల ధరల పెంపుతో రైతులు బెంబేలెత్తిపోతు న్నారు. రైతులు ఎక్కువగా వినియోగించే 20-20 రకం మొన్నటి వరకు బస్తాకు రూ. 1,400 ఉండగా ప్రస్తుతం ఏకంగా రూ. 1800 లకు పెరిగింది. అలాగే పొటాష్ ధర మొన్నటి వరకు రూ. 1,800 ఉండగా ప్రస్తుతం రూ. 1,975కు చేరింది. 14-35-14 రకం ఎరువుల మొన్నటి వరకు రూ. 2,100 బస్తాకు ఉండగా, ప్రస్తుతం రూ. 2,400 చేరింది. 10.26-26 రకం ఎరువుల కూడా రూ. 1200 నుంచి రూ. 1,700లకు పెరిగాయి. దీంతో పాటు 12-3 2-16 రకం ఎరువులు బస్తాకు రూ. 2,025 నుంచి రూ. 2,300 వరకు పెరిగాయి. సూపర్ పాస్పేట్ ధర రూ. 600 నుండి 800 లకు పెరిగింది. అలాగే 16-16-16 రకం ఎరువుల రూ.1,675 నుంచి రూ. 2,050కి పెరిగాయి. 24-24-0రకం ఎరువులు 2వేల నుంచి రూ. 2,350 లకు పెరగడం గమనార్హం. ఇలా ఒక్కో బస్తాకు రూ. 300 నుంచి 500 వరకు ధర పెరగడంతో రైతుల పెట్టుబడులు సైతం అమాంతం పెరిగి పోనున్నాయి. ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభు త్వాలు చేయూత నందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.