తుది దశకు ఎఫ్‌సీడీఏ కార్యాలయం
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:47 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షిస్తూ..
జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు
రంగారెడ్డి అర్బన్/కందుకూరు/ ఇబ్రహీంపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షిస్తూ.. దాదాపు 500పైగా పరిశ్రమలను స్థాపించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా బేగరికంచ-మీర్‌ఖాన్‌పేటలో రూ.19కోట్ల వ్యయంతో, 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) కార్యాలయ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భవనాన్ని జూన్ మొదటివారంలో (5వ తేదీ తర్వాత) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నానక్‌రాంగూడలో ఉన్న ఈ కార్యాలయాన్ని.. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా మీర్‌ఖాన్‌పేటలో ప్రభుత్వం సుమారు 7.29ఎకరాల భూమిని కేటాయించి, 2025 డిసెంబరులో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది. కమిషనర్ ఛాంబర్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, టెక్నికల్ అధికారులు, సిబ్బంది కోసం అత్యాధునిక క్యాబిన్లను ఇక్కడ సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 56 గ్రామాలను కలుపుతూ 765 చదరపు కిలోమీటర్లతో నూతనంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుండగా, మొదట ఎఫ్‌సీడీఏ భవన ప్రారంభం ఇందుకు అంకురార్పణగా నిలవనుంది. ఈ కార్యాలయం నుంచే ఇకపై రియల్‌ఎస్టేట్ లే అవుట్లు, భూ సమస్యల పరిష్కారం, అనుమతుల ప్రక్రియ వంటి పనులు సాగనున్నాయి. ఇక్కడి నుంచే మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఎఫ్‌సీడీఏ భవనానికి సోలార్ పవర్ లైన్ సౌకర్యాన్ని పూర్తి చేశారు.
భూముల ధరలకు రెక్కలు
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్లలతో పాటు కల్వకుర్తి పరిధిలోని నాలుగు మండలాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అభివృద్ధి పనుల వల్ల.. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మహేశ్వరం, ఇబ్రహీంపట్నంతోపాటు కల్వకుర్తి పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల రేపురేఖలు మారనున్నాయి. కాగా, రావిర్యాల ఔటర్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి వరకు 330 అడుగులతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. మొదటిదశ కింద మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.4 కిలోమీటర్లు, రెండవఫేజ్ కింద ఆకుతోటపల్లి వరకు 22.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మీర్‌ఖాన్‌పేట్ రెవెన్యూ పరిధిలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 14 బ్లాకులకు గాను మొదటి దశకు సంబంధించి ఏడు బ్లాకుల పనులు సంబంధించిన భవనాల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. మీర్‌ఖాన్‌పేట్ వద్ద ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ భవన నిర్మాణపనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ డెవల్‌పమెంట్ భవనానికి గానూ యాచారం మండలంలో ప్రభుత్వం 20 ఎకరాల భూములు కేటాయించింది. 2003లో గ్రామీణ ప్రాంతంగా ఉండి, ప్రస్తుతం కాస్మోపాలిటన్ సిటీగా సైబరాబాద్ మారినట్లే.. ఫ్యూచర్ సిటీ కూడా భవిష్యత్తులో తెలంగాణకు తలమానికంగా నిలవనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.