యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పు
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:40 AM
ఫ్యాటీ లివర్.. కాలేయంలో అతిగా కొవ్వు చేరడం.. కాలేయం పని తీరును దెబ్బ తీసే ఈ తీవ్రమైన సమస్య ఇటీవల కాలంలో యువతలో అధికమవుతోంది.
గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలోనే తీవ్ర దశ కేసులు
ప్రస్తుతం 25-35 ఏళ్ల మధ్యవయస్కుల్లోనూ సమస్య
ఐటీ నిపుణుల్లో 84శాతం మందికి ముప్పు: అధ్యయనం
ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే నివారణ: వైద్యులు
నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఫ్యాటీ లివర్.. కాలేయంలో అతిగా కొవ్వు చేరడం.. కాలేయం పని తీరును దెబ్బ తీసే ఈ తీవ్రమైన సమస్య ఇటీవల కాలంలో యువతలో అధికమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులను ఫ్యాటీ లివర్ వేగంగా కబళిస్తోంది. హైదరాబాద్‌లో సుమారు 40.9 శాతం మంది మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసిజ్ (ఎంఎఎస్ఎల్‌డీ) బారినపడుతున్నారు. అంటే ఫ్యాటీ లివర్‌కు తోడు ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాటీ లివర్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని రెండు కార్పొరేట్ ఆస్పత్రులు వేర్వేరుగా చేసిన అధ్యయనాల్లో ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ(ఏఐజీ) ఆస్పత్రికి వచ్చే రోగులపై ఆ ఆస్పత్రి వైద్యులు అధ్యయనం చేశారు. దాని ప్రకారం.. ఐదేళ్ల క్రితం వరకు ఫ్యాటీ లివర్ బాధితుల్లో 55-60 శాతం మంది 50ఏళ్లు పైబడినవారే ఉండేవారు. మిగిలిన 40 శాతం కేసుల్లో 25-45 ఏళ్ల మధ్య వయస్కులు ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తాజా అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ కేసుల్లో 50-55 శాతం మంది 25-45 ఏళ్ల వయస్సు లోపు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా 35-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో సమస్య అధికంగా కనిపిస్తోంది. మిగతా కేసులు 50ఏళ్లు పైబడిన వారిలో నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన ఫ్యాటీ లివర్ రోగుల్లో సుమారు 40శాతం మంది ఇప్పటికే తీవ్రమైన దశకు (సిరోసిస్) చేరుకుంటున్నారు. యువతలో ఈ తీవ్రమైన స్థితి కేవలం 10-15 శాతమే ఉంది.
ఐటీ నిపుణుల్లో 84 శాతం మందికి ముప్పు
హైదరాబాద్ వాసులలో ఫ్యాటీ లివర్ ముప్పు తీవ్రంగా ఉందని స్టార్ ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలోనూ వెల్లడైంది. నగరవాసులలో 40.9శాతం మంది ఎంఎఎస్ఎల్‌డీ బారినపడుతున్నారని, ఇది జాతీయ సగటు(38.9శాతం) కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆ స్టడీ పేర్కొంది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, మితిమీరిన ఒత్తిడి కారణంగా ఐటీ నిపుణుల్లో ఈ వ్యాధి ప్రభావం ఏకంగా 84 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఫ్యాటీ లివర్ కేసుల్లో 46 శాతం మగవారు, 36 శాతం ఆడవారు కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కాలేయ కేన్సర్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించింది.
ఆహారపు అలవాట్లలో మార్పుతోనే నివారణ!
ఫ్యాటీ లివర్ అంశంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ధోరణి భవిష్యత్తులో కాలేయ వ్యాధుల భారీ పెరుగుదలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులతోపాటు సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్లే ఈ సమస్య వస్తుందని అన్నారు. తొలి దశలోనే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జంక్, ప్రాసెస్డ్ ఫుడ్‌తో ముప్పు
కొన్నేళ్లుగా మన జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులు నేరుగా కాలేయం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు మద్యం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగాయి. శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి కుర్చీలకు పరిమితమై పని చేయడం పెరిగింది. ఇవన్నీ కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. అనారోగ్య అలవాట్ల వల్లే యువత ఎక్కువగా కాలేయ సమస్యలకు గురవుతున్నారు. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో కూడా కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించడం, జంక్-ప్రాసెస్డ్ ఫుడ్‌ను నివారించడం, సమతుల ఆహారం తీసుకోవడం లివర్ డిసిజెస్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే హెపటైటిస్-బి పరీక్షలు చేయించుకోవడం, సమయానికి టీకాలు వేయించుకోవడం కూడా ముఖ్యం
- డాక్టర్ వెనిశెట్టి శాంతన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు,
హెపటాలజిస్టు, ఏఐజీ ఆస్పత్రి, హైదరాబాద్