Share News

Tragic Incident: భార్య వదిలేసిందన్న మనస్తాపంతో..ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి

ABN , Publish Date - Jan 07 , 2026 | 04:07 AM

భార్య వదిలేసిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో జరిగింది.

Tragic Incident: భార్య వదిలేసిందన్న మనస్తాపంతో..ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి

  • ఆ తర్వాత ఆత్మహత్యకు విఫలయత్నం

  • నారాయణపేట జిల్లాలో దారుణం

మరికల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): భార్య వదిలేసిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు పదేళ్ల కిత్రం పెద్దజట్రం గ్రామానికి చెందిన సుజాతతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు రిత్యిక(8), చైతన్య(5) ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు. తండ్రి దగ్గర ఉన్న పిల్లలను తాత, నానమ్మ పోషిస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన శివరాములు తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారని, వారిని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి పిల్లలను పొలం వద్దకు తీసుకెళ్లి ఉరి బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాలను దగ్గరలో ఉన్న కోయిల్‌సాగర్‌ డిస్ట్రిబ్యూటరీ కాల్వలో పడేశాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించి.. మొదట దగ్గరలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కరెంట్‌ తీగను తాకగా.. గాయాలయ్యాయి. అనంతరం బ్లేడుతో గొంతు కొసుకున్నా.. చనిపోలేదు. చివరకు పురుగుల మందు తాగి తెల్లవారుజామున 4 గంటలకు బంధువులు, స్నేహితులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివరాములును చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. నీటిలో ఉన్న పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.

Updated Date - Jan 07 , 2026 | 04:07 AM