Family Tragedy: బిడ్డలను బలితీసుకున్న తండ్రి మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:52 AM
అభం శుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఘటనలో.. తండ్రి శివరాములు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కడసారి చూపునకు కూడా రాని తల్లి
మరికల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఘటనలో.. తండ్రి శివరాములు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరుకు చెందిన చాకలి శివరాములు, సుజాత దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఇద్దరు పిల్లలు రిత్యిక(8), చైతన్య(5) శివరాములు వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన శివరాములు.. మంగళవారం పిల్లలకు ఉరి బిగించి చంపేసి, ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున అతడూ మృతి చెందాడు. కాగా, కడుపున పుట్టిన బిడ్డలు శవాలై పడిఉన్నా సుజాత మనసు కరగలేదు. చిన్నారుల కడసారి చూపునకు రావడానికి నిరాకరించింది. పోలీసులు సమాచారం అందించినప్పటికీ, తనకు సంబంధం లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నానమ్మ, తాతయ్యలే చిన్నారుల అంత్యక్రియలు పూర్తిచేశారు.