Share News

మంటల్లో తండ్రి, కూతురు దహనం!

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:55 AM

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాజీవ్‌గృహకల్ప (కడిపికొండ)లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో తండ్రి, కూతురు తీవ్ర అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమయ్యారు.

మంటల్లో తండ్రి, కూతురు దహనం!

  • ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారంటున్న మృతురాలి భర్త

  • అతడిదే దుర్మార్గం.. ఇద్దరినీ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం

  • పోలీసులకు మృతురాలి చెల్లెళ్ల ఫిర్యాదు

  • మృతుల ఒంటిపై తీవ్ర గాయాలు?

  • హనుమకొండ జిల్లాలో ఘటన

మడికొండ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాజీవ్‌గృహకల్ప (కడిపికొండ)లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో తండ్రి, కూతురు తీవ్ర అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమయ్యారు. ఇద్దరూ ఒంటిపై డీజిల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటూ మృతురాలి భర్త చెబుతుండగా.. అతడే దుర్మార్గానికి ఒడిగట్టాడని, అదనపు కట్నం కోసమే తన అక్కను, తండ్రిని బలిగొన్నాడని మృతురాలి ఇద్దరు చెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. మడికొండ పోలీసులు, బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. రాజీవ్‌ గృహకల్ప 5వ బ్లాక్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న బాషబోయిన రాజశేఖర్‌(51)కు భార్య శ్రీలత, కుమార్తెలు రాజశ్రీ(24), తేజస్వి, మనోజ్ఞ ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం శ్రీలత గుండెపోటుతో మృతిచెందింది. రాజశేఖర్‌ ఆటో నడుపుతూ, వంటలు చేస్తూ కూతుళ్లను పోషించుకుంటున్నాడు. రాజశ్రీకి, తేజస్వికి పెళ్లిళ్లయ్యాయి మనోజ్ఞ బంధువుల ఇంట్లో ఉంటోంది. రాజశ్రీని వరంగల్‌ జిల్లా గీసుగొండ మండ లం శాయంపేట (హవేలీ)కు చెందిన పొక్కుల ప్రవీణ్‌కు ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.3లక్షల నగదు, కానుకలు ఇచ్చారు. రాజశ్రీ-ప్రవీణ్‌ దంపతులకు కుమారుడు జయాంశ్‌ (2), ఓ కూతురు (6నెలలు) ఉన్నారు. ప్రవీణ్‌ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. ప్రవీణ్‌ అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు రాజశ్రీ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. పాప పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం రాజశ్రీని ప్రవీణ్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. నెల క్రితం పాపకు అన్నప్రాసన కోసం రాజశ్రీ పుట్టింటికి వచ్చింది. మంగళవారం అక్కడికి ప్రవీణ్‌ వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్‌ తన బంధువులకు ఫోన్‌ చేసి.. భార్య రాజశ్రీ, మామ రాజశేఖర్‌ ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. విష యం తెలుసుకొని తేజస్వి, మనోజ్ఞ ఆ ఇంటికి వచ్చారు. తండ్రి, అక్క మంటల్లో పూర్తిగా కాలిపోయి కనిపించడంతో హతాశులయ్యారు. అక్కడే నిల్చున్న బావ ప్రవీణ్‌ను ఉద్దేశించి.. ఘటన ఎలా జరిగింది? అని ప్రశ్నించగా అతడు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహాల తలపైన బలమైన ఆయుధాలతో కొట్టినట్లుగా గాయాలున్నాయని.. అదనపు కట్నం కోసం ప్రవీణే ఆ ఇద్దరినీ కొట్టి చంపి.. డీజిల్‌ పోసి దహనం చేసి, ఆత్మహత్య ఘటనగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడని తేజస్వి, మనోజ్ఞ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి, అక్కను బలిగొన్న ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 19 , 2026 | 03:55 AM