kumaram bheem asifabad- రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:24 PM
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలని, అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాదించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ కె హరిత అన్నారు. పట్టణంలోని ప్రేమల గార్డెన్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కిసాన్మేళాను ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్బాబులతో కలిసి ప్రారంభించారు
ఆసిఫాబాద్రూరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలని, అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాదించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ కె హరిత అన్నారు. పట్టణంలోని ప్రేమల గార్డెన్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కిసాన్మేళాను ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్బాబులతో కలిసి ప్రారంభించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ సంబందిత స్టాళ్లను సందర్శించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానం రైతులకు అందుబాటులో ఉన్న నూతన ఉత్పత్తులు సాగు పద్ధతుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు నూతన సాగు విధానాలు అధిక దిగుబడులు సాధించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్మేళాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న వన రులను దృష్టిలో ఉంచుకొని పంటలు ఎంపిక చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఏవో వెంకటి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్, పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ అహ్మద్, సర్పంచ్ బుర్స పోచయ్య, పశుసంవర్థకశాఖ ఏడీ సురేష్, జిల్లా ఉద్యానవనాధికారి నదీం, మత్స్యశాఖ జిల్లా అధికారి సాంబశివరావు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్ఐవీ అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 736 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని వారందరికి రిమ్స్ అసుపత్రి ద్వారా చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా సురక్షిత స్థానంలో ఉందని ఎయిడ్స్ వ్యాధిపై ఎలాంటి అపోహలు భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. హెచ్ఐవీ లక్షణాలు ఉన్న వ్యక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొవచ్చని తెలిపారు. ఎయిడ్స్ హెల్ప్లైన్ 1097 ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఎంహెచ్ఓ నాగేంద్ర సిడాం, వైద్యులు, వైద్య సిబ్బంది, స్వచ్చంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.