kumaram bheem asifabad- రేపటి నుంచి రైతు భరోసా
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:14 PM
రైతన్నకు భరోసా దక్కనుంది. మూడు నెలల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం ఆది వారం నుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడి సహాయాన్ని మూడు విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కొత్త పట్టాదారులకు కూడా ఈ యాసంగి నుంచే అవకాశం ఇవ్వనున్నారు.
- కొత్త పట్టాదారులకు అవకాశం
- కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
చింతలమానేపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రైతన్నకు భరోసా దక్కనుంది. మూడు నెలల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం ఆది వారం నుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడి సహాయాన్ని మూడు విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కొత్త పట్టాదారులకు కూడా ఈ యాసంగి నుంచే అవకాశం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఆయా గ్రామాల వారీగా జిల్లా వ్యవసాయశాఖ కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో 1,43,063 మంది రైతులు రైతు భరోసాను అందుకున్నారు. ఈ సంఖ్య యాసంగి సాజన్‌లో పెరిగే అవకాశం ఉన్నది.
యాసంగి ప్రారంభమై..
యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం రైతుభరోసా ఆర్థికసాయం విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ సీజన్‌కు ఇంకా ఆశలు వదులుకోవలసిందేననే అభిప్రాయం రైతుల్లో కలిగింది. ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యక్తమవుతున్న నిరసనను గమనించిన తర్వాత ఈ నెల 22 నుంచి ఈసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట మూడు విడతలుగా ఏప్రిల్ నెలాఖరునాటికి రైతులందరికీ రైతుభరోసా అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే మూడు విడతల పంపిణీ పట్ల పలు పార్టీలు, రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తూ మొదటి విడత ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించి ఆ తర్వాత చేతులెత్తేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ఒకే విడతలో వారంరోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వారికున్న విస్తీర్ణం మొత్తానికి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
- కొత్త పట్టాదారులకు అవకాశం..
కొత్త పట్టాదారులకు రైతు భరోసా దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2026 ఫిబ్రవరి 28 వరకు భూమి కొనుగోలు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు అర్హులు. మార్చి 25 వరకు నమోదు చేసుకోవాలి. పట్టాపాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, దరఖాస్తు ఫారం, మొబైల్‌నంబర్‌తో జిరాక్స్ కాపీలను క్లస్టర్ ఏఈఓల వద్ద లేదా రైతు వేదికలో సమర్పించాలి. మండల విస్తీర్ణ వ్యవసాయ అధికారులు దృవీకరిస్తారు. బ్యాంక్ వివరాలు అప్‌లోడ్ చేస్తే డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి.
కొత్త పట్టాదారులు ధరఖాస్తులు చేసుకోవాలి..
- వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి
కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు రైతు భరోసా కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ అఽధికారులు, ఏఈవోలు అవసరమైన సేవలను అందిస్తారు. ఇప్పటి వరకు సాయం పొందని, బ్యాంక్ వివరాలు అందివ్వని రైతులు వెంటనే ఽనమోదు చేసుకోవాలి. పాతవారు ఇప్పటి వరకు రైతు భరోసా పొందిన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన లేదు.