ధాన్యం ధర ఎందుకు తగ్గించారు?
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:09 AM
ధాన్యం నాణ్యత బాగున్నా అకారణంగా ధర ఎందుకు తగ్గించారు? అని నల్లగొం డ జిల్లా మిర్యాలగూడలోని మిల్లర్లను రైతులు ప్రశ్నించారు.
మిలర్లతో రైతుల వాగ్వాదం.. కొనుగోళ్లు నిలిపివేసిన మిల్లర్లు
మిర్యాలగూడ రూరల్/వేములపల్లి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ధాన్యం నాణ్యత బాగున్నా అకారణంగా ధర ఎందుకు తగ్గించారు? అని నల్లగొం డ జిల్లా మిర్యాలగూడలోని మిల్లర్లను రైతులు ప్రశ్నించారు. ఇది వాగ్వాదానికి దారితీసి.. కొనుగోళ్ల నిలిపివేతకు, చివరికి రైతుల రాస్తారోకోకు దారితీసింది. జిల్లాలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం, మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లికి చెందిన రైతులు సోమవారం రాత్రి తక్కువ ధరకు ధాన్యంఎందుకు కొంటున్నారంటూ గ్రామ సమీపంలోని ఓ మిల్లు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలంలోని మిల్లర్లు మంగళవారం ఉదయమే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు బాదలాపురం బందం నుంచి అవంతీపురం వరకు, ఎక్స్‌రోడ్డు యాద్గార్‌పల్లి, తుంగపాడు, వెంకటాద్రిపా లెం ప్రాంతాల్లో మొత్తం 1500 ధాన్యం ట్రాక్టర్లు మిర్యాలగూడ-కోదాడ ప్రధానరహదారిపై 3 కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ధాన్యం ట్రాక్టర్లను లోపలికి అనుమతించకుండా మిల్లుల వద్ద గేట్లు మూసివేశారు. మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్‌రాజుల రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వారితో చర్చలు జరిపి ధాన్యం కొనుగోలుకు అంగీకరింపజేయటంతో.. మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలు యథావిధిగా కొనసాగాయి.