పచ్చని పంట పొలాల్లో ప్రభుత్వ కార్యాలయమా?
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:27 AM
సాగులో ఉన్న పచ్చని పంట పొలాలను ప్రభుత్వ కార్యాలయం కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా రైతులు నిరసనకు దిగారు....
రంగారెడ్డి జిల్లా కోహెడాలో రైతుల నిరసన
హయత్‌నగర్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సాగులో ఉన్న పచ్చని పంట పొలాలను ప్రభుత్వ కార్యాలయం కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా రైతులు నిరసనకు దిగారు. గ్రామంలోని సర్వే నంబర్ 167/1లో ఉన్న నాలుగెకరాల భూమిని సమీకృత సబ్‌రిజిస్టార్ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడా గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో సమక్షంలోనే అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి తీరును ఖండించారు. పంటలు ఉన్న భూమిని చదును చేయడాన్ని అడ్డుకున్న రైతులు.. పొలంలోనే టెంట్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతుల ప్రతినిధి కందాళ బలదేవ్‌రెడ్డి మాట్లాడుతూ.. తహశీల్దార్ ప్రభుత్వానికి తప్పుడు నివేదికను అందిస్తున్నారని ఆరోపించారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. అధికారులు తమ పొలాలను చదును చేయడం పట్ల ఆగ్రహం తెలిపారు. కాగా, బాధితులతో మాట్లాడిన తర్వాతే పొలాన్ని చదును చేశామని తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. భూమి కోల్పోతున్న రైతులు నష్ట పరిహారం కోరుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.