కొనుగోళ్లలో కోటి సమస్యలు!
ABN , Publish Date - May 29 , 2026 | 03:30 AM
ధాన్యం సేకరణకు 8,575 కొనుగోలు కేంద్రాలు... రవాణాకు 13,300 వాహనాలు.. ధాన్యం నింపడానికి 21 కోట్ల గోనె సంచులు...
కాంటాల కోసం రైతుల ఎదురుచూపులు.. లారీలు, గోనె సంచుల కొరతతో ఇబ్బందులు
బస్తాకు 3 కిలోల తరుగు.. మిల్లర్ల ఇష్టారాజ్యం
హమాలీల కొరత.. వర్షాలకు తడుస్తున్న ధాన్యం
మిల్లుకు ధాన్యం చేర్చే బాధ్యత.. రైతులకే అప్పగింత
జాప్యంతో దళారీలకే అమ్ముతున్న రైతులు
90 లక్షల నుంచి 75 లక్షల టన్నులకు తగ్గిన లక్ష్యం
హైదరాబాద్/ నెట్‌వర్క్, మే 28(ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణకు 8,575 కొనుగోలు కేంద్రాలు... రవాణాకు 13,300 వాహనాలు.. ధాన్యం నింపడానికి 21 కోట్ల గోనె సంచులు... టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు... ఇలా అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగినా, ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. లారీలు, గోనెసంచులు, హమాలీల కొరత, తరుగు దోపిడీ.. వెరసి రైతులు ముప్పతిప్పలు పడుతున్నారు. దళారులను కాదని ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే వారం నుంచి రెండు వారాల పాటు రైతులు చెమటోడ్చాల్సి వస్తోంది. ధాన్యం డబ్బుల చెల్లింపులు పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ... కొనుగోళ్లలో కోటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి కాంటా పూర్తయిందంటే.. ధాన్యం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. కానీ.. లారీల కొరతతో ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మిల్లుకు చేరే దాకా రైతుదే బాధ్యత అన్నట్టుగా పరిస్థితి ఉంది. లారీల కిరాయి, హమాలీల ఖర్చులు.. రైతు కు అదనపు భారంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లా లో కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోతే... రైతులే రోడ్లపైకి వెళ్లి దారి వెంట వెళ్లే లారీలను అడ్డుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి ధాన్యం బస్తాలు లోడ్ చేశారు. తిర్మలాపూర్‌కు లారీలు రాకపోవడంతో.. ఒక రైతు ఎక్స్‌కవేటర్ సహాయంతో టిప్పర్‌లో ధాన్యం పోసి రైస్‌మిల్లుకు తరలించారు. ట్రాక్టర్లు, బొలేరోలు, డీసీఎంలు ఉన్న రైతులు సొంతంగా రైస్‌మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. ఇలా సొంతంగా తరలించినా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీ డ్రైవర్లు కలిసి బస్తాకు రూ.3 వసూ లు చేస్తున్నారు. ఇది కాకుండా లోడింగ్, అన్‌లోడింగ్ కోసం బస్తాకు రూ.5 దాకా ఖర్చు చేయా ల్సి వస్తోంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లిలో నెల రోజులుగా కాంటా వేయడం లేదు. లారీల కొరతతో సిరిసిల్లలో 50 వేల టన్నుల ధాన్యం కాంటా పెట్టకుండా ఉంది. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కాంటా పెట్టాలంటే మరో 10 రోజులు పడుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో లారీల కొరతతో కల్లాల్లోనే ధాన్యపు రాశులు ఉన్నాయి. ములుగులో నెలక్రితం వరికోతలు జరిగినా... ఇంతవరకు కాంటా పెట్టలేదు. భూపాలపల్లిలో ఒక్కో లారీకి రూ.5వేల చొప్పున కిరాయి చెల్లించి.. రైతులే మిల్లులకు తరలిస్తున్నారు. జనగామ జిల్లాలో 50శాతం కొనుగోళ్లే జరిగాయి.
భువనగిరి జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉంది. నల్లగొండ జిల్లాలో 74వేల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 80వేల టన్నులు ధాన్యాన్ని ఇంకా కాంటా పెట్టలేదు. నల్లగొండ జిల్లాలోని డిండి, ఖానాపూర్, రామంతాపూర్, టీగౌరారం కొనుగోలు కేంద్రాల్లో 120 లారీల ధాన్యం నిల్వ లు పేరుకుపోయాయి. శాలిగౌరారం, వల్లాల, రామాంజిపురం, చిత్తలూరు, ఉప్పలంచ గ్రామాల్లో ఇదేపరిస్థితి. భువనగిరి జిల్లా మోత్కూరులో 90 మంది ధాన్యం తీసుకెళ్తే... 24 మంది రైతుల వడ్లు మాత్రమే కొన్నారు. బస్తాకు 2 కిలోల తరుగు, డీసీఎం డ్రైవరుకు రూ.5, హమాలీలకు బస్తాకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని రైతు కెమిడి రాములు వాపోయారు. మహబూబ్‌నగర్‌లో 10-15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చి నా.. ధాన్యం కొనలేదు. వనపర్తి జిల్లాలో 2.30 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా, 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో విసిగిపోతున్న రైతులు.. ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. అందుకే సేకరణ లక్ష్యాన్ని 90లక్షల టన్నుల నుంచి 75లక్షల టన్నులకు ప్రభుత్వం తగ్గించింది.
హమాలీలు, గోదాముల కొరత
కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత సమస్యగా మారింది. బెంగాల్‌లో ఎన్నికలు, బిహార్‌లో హార్వెస్టింగ్ కారణంగా... ఇక్కడ హమాలీలు దొరకటం లేదని ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ సాకులు చెబుతోంది. స్థానిక కూలీలనూ సమకూర్చడం లేదు. యాసంగి సీజన్‌కు 21 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు పౌరసరఫరాలశాఖ చెబుతున్నా.. రైతులకు దొరకడం లేదు. మరోవైపు, గోదాముల కొరత కూడా తీవ్రంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతోంది. జూన్ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైస్‌మిల్లర్ల ‘తరుగు’ దోపిడీ
రైస్ మిల్లులకు ధాన్యాన్ని చేర్చిన తర్వాత, మిల్లర్లు తరుగు తీసి... ఆ తర్వాత ట్రక్ షీటు ఇస్తున్నారు. బస్తాకు ఎంత తరుగు తీయాలనేదీ మిల్లర్లే నిర్ణయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది, చౌటకూరు, పుల్కల్, కొండాపూర్ సెంటర్లలో బస్తాకు 3 కిలోల చొప్పున మిల్లర్లు తరుగు తీస్తున్నారు. ములుగు జిల్లాలో క్వింటాల్‌కు 8-10 కిలోలు తరుగు తీస్తున్నారు. జనగామలో మిల్లర్లు టెస్ట్ మిల్లింగ్ చేస్తున్నారు. 70శాతం బియ్యం రికవరీ వస్తేనే దిగుమతి చేసుకుంటున్నారు. తరుగు, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలు కోత పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కడ్తా పేరుతో 5-8 కిలో ల తరుగు తీస్తున్నారు. రవాణా ఖర్చుల కింద క్వింటాలుకు రూ.10 వసూలు చేస్తున్నారు.