Share News

అప్పు కింద రైతు భరోసా, వృద్ధాప్య పింఛను

ABN , Publish Date - May 02 , 2026 | 05:58 AM

ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుభరోసా, వృద్ధులకు అందిస్తున్న పింఛను మొత్తాన్ని బ్యాంకుల తీరుతో వారు పొందలేకపోతున్నారు.

అప్పు కింద రైతు భరోసా, వృద్ధాప్య పింఛను

  • ఖాతాలను హోల్డ్‌ చేస్తున్న బ్యాంకులు

  • రైతులు, పింఛనుదారుల ఆందోళన

జగదేవపూర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుభరోసా, వృద్ధులకు అందిస్తున్న పింఛను మొత్తాన్ని బ్యాంకుల తీరుతో వారు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేసినప్పటికీ.. పంటరుణాల బకాయిల పేరుతో బ్యాంకులు వారి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. దీంతో రైతులు, వృద్ధాప్య పింఛనుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపుర్‌ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన రైతు మామిండ్ల బాల్‌నర్సయ్యకు ఇటీవల రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అయ్యాయి. వాటిని ఉపసంహరించుకునేందుకు తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (టీజీవీబీ)కు వెళ్లగా అకౌంట్‌ హోల్డ్‌లో ఉందని, పంట రుణం చెల్లిస్తేనే అకౌంట్‌ను హోల్డ్‌ నుంచి తొలగిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. బాల్‌నర్సయ్య ఇదే బ్యాంకు నుంచి రూ. 70 వేల పంటరుణం తీసుకున్నారు. పంట కోయగానే రుణాన్ని తీరుస్తానని చెప్పినా అధికారులు వినడం లేదు. అదే గ్రామానికి చెందిన ముచర్చ అంజయ్యకు ప్రతి నెలా వృద్ధాప్య పింఛను బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతోంది. అదే బ్యాంకుకు ఆయన పంటరుణం బాకీ ఉండడంతో ఆరు నెలలుగా ఆయన అకౌంట్‌ను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. జగదేవ్‌పుర్‌ మండలంలో 15,148 మంది రైతులకు తాజాగా 11.90కోట్ల మేర రైతుభరోసా నిధులు మండలంలోని 3 బ్యాంకుల్లోని వారి ఖాతాల్లో జమ అయ్యాయి. వారిలో 60ు రైతులు ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 02 , 2026 | 05:58 AM