రైతు డిస్కమ్ కావాలి... వద్దు!
ABN , Publish Date - May 30 , 2026 | 04:05 AM
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు లైసెన్స్ ఇవ్వాలని అధికార పార్టీ, ఇవ్వరాదని విపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ....
ఈఆర్సీ వేదికగా అధికార, విపక్షాల బల ప్రదర్శన.. కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి చూడండి: కవిత
వాడేది తక్కువే అయినా 24 గంటలు ఇవ్వాలి: కోదండరెడ్డి
రాష్ట్రమంతా పర్యటించి అభిప్రాయం తీసుకోవాలి: నిరంజన్‌రెడ్డి
కొత్త అప్పుల కోసమే ఈ డిస్కమ్: దొంతి
కలిపే నిర్వహిస్తే కొత్త డిస్కమ్ ఎందుకు? వే ణుగోపాల్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు లైసెన్స్ ఇవ్వాలని అధికార పార్టీ, ఇవ్వరాదని విపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఆర్‌పీడీసీఎల్)కు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలంటూ దాఖలైన దరఖాస్తుపై శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో బహిరంగ విచారణ జరిగింది. ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో విచారణ సాగింది. రైతు డిస్కమ్ లైసెన్స్ విచారణ అధికార, విపక్షాల మధ్య బల ప్రదర్శనగా మారింది. వివిధ పార్టీల నాయకులు, అనుచరులు ఈఆర్‌సీకి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు డిస్కమ్ ఏర్పాటు వెనుక ఏదో కుట్ర దాగుందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. రూ.22 వేల కోట్ల లోటుతో, 42 శాతం విద్యుత్ అందించే బాధ్యతను బదలాయించారని, ఆ మేరకు ఉద్యోగుల బదిలీ జరగలేదని ప్రస్తావించారు. 1000 మందితో డిస్కమ్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ఒక్కో ఉద్యోగికి 600 ట్రాన్స్‌ఫార్మర్లు వస్తాయని గుర్తు చేశారు. 33 జిల్లాల్లో బహిరంగ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు రైతులతో చర్చలు జరపాలన్నారు. ఒక ప్రాంతాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొని, అక్కడ విజయం సాధిస్తేనే రాష్ట్రమంతా విస్తరించాలని చెప్పారు. ఆంధ్రవాళ్ల చేతిలో విద్యుత్ సంస్థలున్నాయని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం పెట్టి, అసెంబ్లీలో చర్చించాలని కోరారు. రైతు డిస్కమ్ వచ్చాక ఎన్ని గంటల కరెంటు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు వాడుతున్నది నిజానికి 2-3గంటల కరెంటేనని, అయితే, 24 గంటల పాటు ఆ కరెంటు అందుబాటులో ఉండాలని తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రైతు డిస్కమ్‌ను సమర్థిస్తున్నామని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన బీఆర్‌ఎస్ వారే రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వా త విద్యుత్ రంగాన్ని అప్పుల పాల్జేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే లైసెన్స్‌పై ముందుకెళ్లాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. 2014లో ఎస్పీడీసీఎల్ ఏ గ్రేడ్‌లో, దేశంలో 9వ స్థానంలో ఉండేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని 52వ స్థానానికి దిగజార్చిందని చెప్పారు. ఎన్పీడీసీఎల్‌ను 16వ ర్యాంకు నుంచి 42వ ర్యాంకుకు దిగజార్చారన్నారు. 2014 లో రూ.1,595 కోట్ల బకాయిలు ఉంటే, రూ.31,698 కోట్లకు చేర్చారన్నారు. డిస్కమ్‌ల దౌర్భాగ్యానికి కారణం బీఆర్‌ఎస్సే అని మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. రైతు డిస్కమ్‌కు లైసెన్స్ ఇవ్వరాదని బీఆర్‌ఎస్ నేత నిరంజన్‌రెడ్డి కోరారు. విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రమంతా పర్యటించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 1000మంది ఉద్యోగులతో 30లక్షల మంది వినియోగదారుల సమస్యలెలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. డిస్కమ్ పాలక మండలి మొత్తం అధికారులే ఉండటం సరికాదని పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ ప్రతినిధి దొంతి నర్సింహారెడ్డి అన్నారు. కొత్త అప్పులకోసమే ఈ డిస్కమ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. 3 డిస్కమ్‌ల నిర్వహణ కలిసి కట్టుగా చేస్తే కొత్త డిస్కమ్ ఎందుకని విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ ప్రశ్నించారు. కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయడం కాదు ఉన్న రెండు డిస్కమ్‌లను విలీనం చేయాలన్నారు.
మోటార్లకు కాదు.. ట్రాన్స్‌ఫార్మర్లకే మీటర్లు: సీఎండీ
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టబోమని, కేవలం ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే మీటర్లు పెడతామని రైతు డిస్కమ్ సీఎం డీ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పష్టం చేశారు. మరో రెండు వినియోగదారుల సమస్యల వేదికలు రైతు డిస్కమ్ పరిధిలో పెడుతున్నామని చెప్పారు. రైతు డిస్కమ్‌పై అభ్యంతరాలు/అభిప్రాయాలను తీసుకొని, నివృత్తి చేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ దేవరాజు నాగార్జున్ సీఎండీలను ఆదేశించారు.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్!
ఈఆర్‌సీ బహిరంగ విచారణకు బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ నేతలు ఒకేసారి హాజరయ్యారు. ఈఆర్సీ కమిషన్ ఎదుట టీఆర్‌ఎ్‌స(తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూర్చోగా.. ఆమె పక్కన బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి కూర్చున్నారు. వీరంతా చాలాసేపు అక్కడే కూర్చున్నా.. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. వాస్తవంగా.. ఈఆర్సీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావాల్సి ఉంది. అయితే సిరిసిల్లలోని వార్డు కౌన్సిలర్ పద్మ మరణించడంతో.. ఆయన సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు. ఒకవేళ కేటీఆర్ హాజరైనా పరిస్థితి ఇలాగే ఉండేదని, టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒక్కచోట ఉన్నా.. మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవంటూ.. సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు వెలిశాయి. ఈ అంశాన్ని రాజకీయ కోణంలోనూ విశ్లేషిస్తూ.. కవితకు అనుకూలంగా కొందరు, బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా కొందరు పోస్టులు పెట్టడం ఆసక్తి కలిగించింది.