Share News

Indira Devi Dhanrajgir: తిరిగిరాని లోకాలకు మన రాజకుమారి

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:16 AM

దక్షిణాదిలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన ధన్‌రాజ్‌గిర్‌ వారసురాలు, ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి, ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరి రాజకుమారి ఇందిరాదేవి ...

Indira Devi Dhanrajgir: తిరిగిరాని లోకాలకు మన రాజకుమారి

  • రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత

  • ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర జీవన సహచరి

  • దక్షిణాదిలోనే ఒకనాటి సంపన్న కుటుంబాల్లో ధన్‌రాజ్‌గిర్‌ ఒకటి

  • 1973లో నోబెల్‌కు నామినేట్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన ధన్‌రాజ్‌గిర్‌ వారసురాలు, ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి, ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జ్ఞాన్‌ బాగ్‌ ప్యాల్‌సలో తుదిశ్వాస విడిచారు. 1930, ఆగస్టు17న నిజాం సంస్థాన సలహాదారుడు రాజా ధన్‌రాజ్‌గిర్‌, రాణి ప్రమీలా దేవిలకు ముంబైలో ఇందిరా దేవి జన్మించారు.చిన్నతనంలోనే హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడే మెహబూబియా బాలికల పాఠశాలలో హైస్కూల్‌ విద్య అభ్యసించారు. అనంతరం ఆమె ఇల్లు జ్ఞాన్‌ బాగ్‌ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇక్బాల్‌ ప్రేరణతో చిన్న వయసులోనే సాహిత్యాభిమానిగా మారారు. తొమ్మిదో ఏటనే రచనలు రాయడం ప్రారంభించారు. ముంబై, పూణె, ఊటీ, హైదరాబాద్‌ నగరాల్లో వీరికి రాజ ఠీవీని ప్రతిబింబించే అందమైన ప్యాలె్‌సలున్నాయి. హైదరాబాద్‌ వారసత్వ కట్టడాల్లో ఒకటైన జ్ఞాన్‌ బాగ్‌ ప్యాలెస్‌ వీరి పూర్వీకులు యూరోపియన్‌ శైలిలో 1890లో నిర్మించారు. తండ్రి రాజా ధన్‌ రాజ్‌గిర్‌ సాహిత్యాభిమాని కావడంతో బాల్యం నుంచి ఆంగ్ల, హిందీ, ఉర్దూ, మరాఠా సాహితీవేత్తలతో ఆమెకు పరిచయం ఏర్పడింది.


ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉర్దూలో ఆమె ద్విపదులు రాశారు. ‘‘ది అపోస్టల్‌ ‘‘ పేరుతో తొలి కవితా సంపుటి వెలువడింది. రిటర్న్‌ ఎటర్నిటీ, పోయెమ్స్‌ ఆఫ్‌ మై నేషనల్‌ మెమోరీ, విండ్‌ బ్లోస్‌ ఫ్రమ్‌ స్కా ఫోల్డ్‌ తదితర 12 పుస్తకాలు ఇందిరా దేవి రాశారు. తన కుటుంబ వారసత్వ చరిత్రను ‘‘మెమోరీస్‌ ఆఫ్‌ ది దక్కన్‌ ‘‘ పేరుతో కాఫీటేబుల్‌ బుక్‌ గా ప్రచురించారు. వరల్డ్‌ పోయెట్రీ సొసైటీ ఇంటర్‌ కాంటినెంటల్‌ సంస్థ 1973లో ఇందిరా దేవిని నోబెల్‌ సాహిత్య పురస్కారానికి నామినేట్‌ చేసింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారతీయ కవయిత్రి ఇందిరాదేవి కావడం విశేషం. ఆమె రాసిన కొన్ని ఆంగ్ల కవితలను ప్రముఖ కవి ముగ్థుమ్‌ ఉర్థూ లోకి అనువదించారు.


శేషేంద్రతో వివాహం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీకి మొట్టమొదటి అధ్యక్షురాలిగా ఇందిరాదేవి బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చిత్రకారిణి కూడా. ముంబైలో ఎం.ఎఫ్. హుస్సేన్ సారథ్యంలో ఇందిర గీసిన చిత్రాలతో 1970వ దశకంలో ప్రదర్శన నిర్వహించారు. శేషేంద్ర శర్మతో వివాహానంతరం కవిత్వ రచనకు విరమణ ప్రకటించారు. ‘ఒకే ఇంట్లో ఇద్దరు కవులు ఉండకూడదు’ అన్నది ఆమె అభిప్రాయం. శేషేంద్ర వల్ల తెలుగు సాహితీ సమాజంతో ఇందిరకు పరిచయం ఏర్పడింది. శేషేంద్ర రాసిన పది వేల ఉత్తరాలతో నాచారంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో నాలుగు వేల పోస్టు కార్డులు ఉండడం విశేషం. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలపై ఆయన సంతతికి, ఇందిరాదేవి మధ్య వివాదం నడిచింది. న్యాయపోరాటంలో ఆమెకు ప్రతికూలంగా ఫలితం వచ్చింది. మహాకవి శ్రీశ్రీ అరెస్టు సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావుకు ఫోన్‌ చేసి విడుదల చేయాల్సిందిగా ఇందిర కోరినట్లు ఓ సందర్భంలో ‘ఆంధ్రజ్యోతి నవ్య’తో ఆమె చెప్పారు. జాతీయ ఉర్దూ కవులతో పాటు కవి సమ్రాట్‌ విశ్వనాథతోనూ ఆత్మీయానుబంధం ఉంది. నిజాం సంస్థానంలో రెండుసార్లు ప్రధానిగా పని చేసిన మహా రాజా కిషన్‌ ప్రసాద్‌తో ఇందిర క్యారమ్స్‌ ఆడారు. మౌంట్‌ బాటెన్‌, సర్దార్‌ జఫ్రీ, ఖైఫీ అజ్మీ వంటి వారితో మంచి పరిచయం ఉండేది. ఏడో నిజాంతోనూ సంభాషించిన ఘనత ఇందిర సొంతం. ఇక్బాల్‌, నెహ్రూ, సర్వేపల్లి, నిజాం కుటుంబసభ్యులు ప్రిన్సెస్‌ ఇస్రా, దుర్రె షావర్‌, పైగా, సాలార్‌ జంగ్‌ వంశస్థులతో ఇందిరా దేవి మైత్రీ కొనసాగించారు. ఇందిరాదేవి ధన్‌ రాజ్‌గిర్‌ అంత్యక్రియలు బుధవారం ఉదయం అంబర్‌పేట శ్మశాన వాటికలో జరుగుతాయని మహేష్‌ విశ్వనాథ తెలిపారు. ఆమె తుది కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా తెలుగు వైదిక సంప్రదాయం ప్రకారం కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తమ్ముడు రాంమ్మూర్తి కుమారుడు విశ్వనాథ శోభనాద్రి చేతుల మీదగా అంతిమ సంస్కారాలు నిర్వహిచనున్నట్లు సమాచారం.

Updated Date - Jan 14 , 2026 | 04:18 AM