Share News

Bhuharthi portal: భూ భారతికి నకిలీ రసీదు

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:17 AM

భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Bhuharthi portal: భూ భారతికి నకిలీ రసీదు

  • ప్రింటర్‌ యాప్‌ను జోడించి జారీ.. రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లింపులు సొంత ఖాతాలోకి మళ్లింపు

  • యాదగిరిగుట్టకు చెందిన మీసేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి

  • ప్రభుత్వ ఖజానాకు పది శాతమే జమ

జనగామ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మీసేవ కేంద్రం నిర్వాహకుడు ‘భూ భారతి’ పోర్టల్‌కు నకిలీ ప్రింటర్‌ యాప్‌ను జోడించి.. తప్పుడు రశీదులు సృష్టించినట్లు, చెల్లింపులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్టకు చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడైన అతడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి భూ భారతి పోర్టల్‌కు నకిలీ ప్రింటర్‌ యాప్‌ను జోడించినట్లు సమాచారం. తద్వారా రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ములో 10 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరేలా చేసి.. రశీదు మాత్రం వంద శాతం చెల్లించినట్లు ప్రింట్‌ వచ్చేలా చేసినట్లు తెలిసింది. మిగిలిన ఆ 90 శాతం మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లు సమాచారం. ఇలా తన వద్దకు వచ్చే డాక్యుమెంట్లను మాత్రమే కాకుండా.. మరికొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులనూ ఈ దందాలోకి దించి.. ఆ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలనూ తన ఖాతాలోకి మళ్లించినట్లు తెలిసింది. అయితే తనకు నగదు లావాదేవీలు ఎక్కువగా కావాలని, అందుకే రూ.లక్షకు పైన రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సిన భూ లావాదేవీలకు స్లాట్‌ను తానే బుక్‌ చేస్తానని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి వాటిని తనకు అప్పగిస్తే రూ.లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా కమీషన్‌ ఇస్తానని వారికి ఆశ చూపించి ఈ దందాలోకి దించినట్లు సమాచారం. జనగామకు చెందిన ఓ మీసేవా కేంద్రం నిర్వాహకుడిని కూడా ఇందులోకి దించగా.. అతడు భయపడి పోలీసులకు సమాచారమిచ్చినట్లు, దీంతో వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కుంభకోణంపై లోకాయుక్త స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి.. విచారణకు ఆదేశించింది.


పోలీసుల విచారణలో వివరాలు వెల్లడి..!

కుంభకోణానికి సూత్రధారి అయిన వ్యక్తితోపాటు మరో ఇద్దరు మీసేవ కేంద్రాల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను అక్రమాలకు పాల్పడ్డ విధానాన్ని సదరు వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూముల లావాదేవీలు, ఎక్కువ రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించే వాటినే అతడు టార్గెట్‌ చేసినట్లు సమాచారం. యాదాద్రితోపాటు జనగామ, ఇతర జిల్లాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ‘రూ.లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తమకే కమీషన్‌ ఇస్తే నీకు వచ్చే లాభమేంటి?’ అని పలువురు ప్రశ్నించగా.. తనకు భూ భారతి ఎన్‌ఆర్‌ఐ లాగిన్‌ ఉందని, దాంతోనే స్లాట్‌ బుక్‌ చేస్తానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఏడాది కాలంగా ఇలా రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీలను తన ఖాతాకు మళ్లించినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఒక్క జనగామ జిల్లాలోనే 60కి పైగా డాక్యుమెంట్లకు సంబంధించిన రూ.52 లక్షల మేర చార్జీలను తన ఖాతాకు మళ్లించానని అంగీకరించినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్‌ సమయంలో స్టాంపు డ్యూటీ ఎంత జమ అయిందో తహసీల్దార్‌లు తనిఖీ చేయాల్సి ఉన్నా.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, అందుకే ఈ అక్రమాలు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులను బుట్టలో వేసుకునే యత్నం?

నిందితుడు పోలీసులను సైతం బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, అతనితోపాటు అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరిని వరంగల్‌ సీపీ సమక్షంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైతం రంగంలోకి దిగి ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కాల్‌ రికార్డులు, బ్యాంకు లావాదేవీల ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు జరిగి ఉండొచ్చని, భారీ మొత్తంలోనే స్కామ్‌ జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే ఈ పని చేశాడా? రాష్ట్ర స్థాయిలో ఎవరి అండయినా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అక్రమాలపై విచారణకులోకాయుక్త ఆదేశం

‘భూ భారతి’ రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్న అంశంపై లోకాయుక్త స్పందించింది. ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదికలను సమర్పించాలని కీలక శాఖలకు నిర్దేశించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, భూపరిపాలన శాఖ చీఫ్‌ కమిషనర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (మీసేవ) కమిషనర్‌, జనగామ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Jan 10 , 2026 | 05:17 AM