Fake Joint Secretary Arrested: నకిలీ జాయింట్ సెక్రటరీ అరెస్ట్
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:07 AM
ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీనంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఫోన్‌కాల్స్‌తో హడలెత్తించిన కేటుగాడిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆటకట్టించిన భూపాలపల్లి పోలీసులు
కృష్ణకాలనీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీనంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఫోన్‌కాల్స్‌తో హడలెత్తించిన కేటుగాడిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. గత నెల 30న రాజేంద్రప్రసాద్ జిల్లా ఎస్సీ డెవల్‌పమెంట్ అధికారి ఇందిర, పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ రావుకు ఫోన్ చేశాడు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలను సాకుగా చూపుతూ.. ‘‘నేను ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీని. మీ పరిధిలోని హాస్టళ్లలో ఇంతటి ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు?. మీపై చర్యలు తీసుకుంటాం’’ అంటూ పొంతన లేకుండా మాట్లాడాడు. అతని మాటతీరుపై అనుమానం రావడంతో డీపీఆర్వో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్, చిరునామా ఆధారంగా నిందితుడు హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌గా గుర్తించి పట్టుకున్నారు. అతడు పలు జిల్లాల అధికారులకు కూడా ఇదే తరహాలో ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
హాస్టల్‌లోకి చొరబడిన వ్యక్తి అరెస్ట్
భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల హాస్టల్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని కాటారంకు చెందిన చీర్ల శ్రవణ్‌గా గుర్తించారు.