నకిలీ ఫైర్ ఎన్వోసీలతో అనుమతులు
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:05 AM
ఇంటర్ బోర్డులో అధికారుల అవినీతి తతంగం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖ పేరుతో నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీ) సమర్పించి పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు పొందినట్టు తేలింది.
విచారణ లేకుండానే అఫిలియేషన్
వందకుపైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాలేజీలే
ఇంటర్ బోర్డులో ఉన్నతాధికారుల కుమ్మక్కు
సమగ్ర విచారణకు ఆదేశం?
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ బోర్డులో అధికారుల అవినీతి తతంగం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖ పేరుతో నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీ) సమర్పించి పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు పొందినట్టు తేలింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 250 కాలేజీలకు అనుమతులు ఇవ్వగా.. వాటిలో సగానికిపైగా నకిలీ ఎన్వోసీలు సమర్పించాయని వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారిణితోపాటు పలు జిల్లాల ఇంటర్ విద్య అధికారుల పాత్ర ఉన్నట్టు తెలిసింది. దీనిపై ఇంటర్ విద్య కార్యదర్శి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలవే అధికం
ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్న భవనాలు 15 మీటర్లకు మించితే తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్వోసీని సమర్పించాలి. వాణిజ్య భవనాల్లో ఉన్న కాలేజీలు 15 మీటర్లతో సంబంధం లేకుండా ఎన్వోసీ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,424 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా.. వాటిలో ఇప్పటి వరకు దాదాపు 250 కాలేజీలకు అనుమతులు లభించాయి. ఇంకా 1,174 కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వాటిలో దాదాపు 400 కాలేజీలు చేసిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే అనుమతులిచ్చిన కాలేజీలు సమర్పించిన ఎన్వోసీలను పరిశీలించగా.. వాటిలో అత్యధికం నకిలీవేనని తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నారు. వీటిలో వందకుపైగా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనివేనని సమాచారం. దీనివెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల నుంచి దరఖాస్తులు రాగానే బోర్డులోని ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు. కానీ, బోర్డులోని ఓ ఉన్నతాధికారిణి ప్రమేయంతో నకిలీ ఎన్వోసీల వ్యవహారానికి తెర లేచిందని, పలు జిల్లాల ఇంటర్ విద్యాధికారులతో కలిసి ఆమె దరఖాస్తులను ఆమోదించారని తెలిసింది. విషయం ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో విచారణ నిర్వహిస్తున్నట్టు సమాచారం.