Share News

అర్హత లేకున్నా కంటి వైద్యం

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:48 AM

విద్యార్హత లేకున్నా కంటి వైద్యం చేసి ఓ మహిళ కంటి చూపు పోయేందుకు కారణమైన నకిలీ వైద్యుడిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు.

అర్హత లేకున్నా కంటి వైద్యం

  • ఓ మహిళకు శుక్లాల శస్త్రచికిత్స.. పోయిన కంటి చూపు

  • బాధితురాలి ఫిర్యాదుతో నకిలీ వైద్యుడి అరెస్టు

  • కన్సల్టెంట్‌ వైద్యుల పేరిట ఐ క్లినిక్‌ల నిర్వహణ

  • నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మరో నలుగురి అరెస్టు

మిర్యాలగూడ అర్బన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్హత లేకున్నా కంటి వైద్యం చేసి ఓ మహిళ కంటి చూపు పోయేందుకు కారణమైన నకిలీ వైద్యుడిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగుచూడటంతో.. విద్యార్హత లేకున్నా కన్సలెంట్‌ వైద్యుల పేరిట ఆస్పత్రులు నిర్వహిస్తున్న మరో నలుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. డిగ్రీ కూడా పూర్తిచేయని పజ్జూరి వికా్‌సకుమార్‌ స్థానిక డాక్టర్స్‌ కాలనీలో ఐదేళ్లుగా మహాలక్ష్మి ఐ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ఓ కన్సల్టెంట్‌ వైద్యుడి పేరు, సర్టిఫికెట్‌ను చూపిస్తూ తానే వైద్యుడిగా చెలామణి అవుతూ రోగులకు కంటివైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో పట్టణానికి చెందిన బైరెడ్డి పద్మ మహాలక్ష్మి ఆస్పత్రికి పరీక్ష కోసం వెళ్లగా.. వికా్‌సకుమార్‌ ఆమెను పరీక్షించి శస్త్రచికిత్స చేసి కుడి కంటిలో శుక్లాలు తొలగించాడు. మరుసటి రోజు పద్మ కంటి చూపు మసకబారింది.. ఆ తర్వాత పూర్తిగా కంటిచూపు కోల్పోయింది. ఈ ఘటనపై బాధితురాలు ఇటీవల పోలీస్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించి వికా్‌సకుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ఇటీవల మెడికల్‌ కౌన్సిల్‌ అధికారుల ప్రత్యేక తనిఖీలో డాక్టర్స్‌ కాలనీలోని శ్రీమహాలక్ష్మి, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రఫా ఐ క్లినిక్‌లలో కన్సల్టెంట్‌ వైద్యుల పేరిట విద్యార్హతలేని వ్యక్తులు వైద్యులుగా చెలామణి అవుతున్నట్లు గుర్తించి వివరాలను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు వికా్‌సకుమార్‌తో మిగతా క్లినిక్‌లను నిర్వహిస్తున్న వల్కీ శ్రీను, గడ్డం నాగరాజు, బాణావత్‌ శివకోటేశ్వరరావు, వెంకటేశ్‌ను నకిలీ కంటివైద్యులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 02:48 AM