ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు పేరిట ఫేక్ కాల్స్
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:34 AM
సైబర్ నేరగాళ్లు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుదారులను కూడా వదలడం లేదు.
తాను పంపిన క్యూఆర్ కోడ్‌కు చెల్లిస్తే ఫీజు తగ్గుతుందని ఫోన్
లేదంటే భారీ జరిమానా పడుతుందని బెదిరింపులు
భువనగిరి టౌన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుదారులను కూడా వదలడం లేదు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మునిసిపాలిటీలోని ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుదారులకు సైబర్ నేరగాళ్లు మునిసిపల్ కమిషనర్ పేరిట ఫోన్లు చేస్తూ తాము పంపే క్యూఆర్ కోడ్‌కు ఫీజు స్కాన్ చేయాలని సూచిస్తున్నారు. అధిక ఫీజు ఉండి చెల్లించిన వారిని టార్గెట్ చేస్తున్నారు. తాను సూచించే ఫీజు చెల్లిస్తే అంతకుముందు చెల్లించిన అధిక ఫీజు తిరిగి వస్తుందని నమ్మ బలుకుతున్నారు. చెప్పిన ఫీజు చెల్లించకుంటే అధిక జరిమానా విధిస్తామని ఫేక్ హెచ్చరికలు చేస్తుండడం గమనార్హం.
కొత్త కమిషనర్ పేరిట ఫోన్
మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగియడం, ప్రస్తుత కమిషనర్ జి.రామలింగం బదిలీ కావడం, నూతన కమిషనర్ రాకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ‘నేను భువనగిరి మునిసిపల్ నూతన కమిషనర్‌ను మాట్లాడుతున్నాను.. మీరు ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి ఉన్నారు. మీ స్థాయి వ్యక్తులు కూడా సకాలంలో చెల్లించకపోవడం సరికాదు. మీ వాట్సాప్‌కు నేను పంపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా వెంటనే ఫీజు చెల్లించండి’ అని పలువురికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక ఆర్‌కే ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజ్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం ఫోన్ చేసిన నిందితుడు తాను నూతన కమిషనర్‌గా పేర్కొంటూ మీరు రూ.9940 ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి ఉందని, తాను పంపే క్యూఆర్ కోడ్ ద్వారా పంపాలని సూచించాడు. రూ.9940 ఫీజును మార్చి 26నే చెల్లించానని డాక్టర్ చెప్పారు. ఆ వెంటనే నిందితుడు మీ ఫీజు రూ.3వేలు మాత్రమేనని, అంతకు రెండింతలు చెల్లించారని చెబుతూ క్యూఆర్ కోడ్ ద్వారా రూ.3వేలు చెల్లిస్తే రూ.9940 మీకు తిరిగి వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కాని అతని మాటపై అనుమానం వచ్చిన సదరు డాక్టర్ మాటలు కొనసాగించేందుకు ప్రయత్నం చేయడంతో నిందితుడు ఫోన్ కట్ చేశాడు. తిరిగి కాల్ చేయగా రింగ్ అవుతున్నప్పటికీ ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానంతో మునిసిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫేక్ కాల్ అని తేలింది. అలాగే స్థానిక పాత బస్టాండ్‌లోని పర్పెక్ట్ ఆఫ్టికల్స్, ఫార్మసీకి గురువారం ఉదయం వచ్చిన ఫోన్ కాల్‌ను ఆప్తమెట్రిస్ట్ అరుణ ఎత్తిన వెంటనే అవతలి వైపు నుంచి నిందితుడు మాట్లాడుతూ ‘మీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి రూ.2100వెంటనే క్యూఆర్ కోడ్‌ద్వారా చెల్లించాలన్నాడు. తమ ఫీజు రూ.3850అని, మార్చినెలలోనే చెల్లించాలని, మునిసిపల్ ఖాతాలో జమ కాలేదని, వెంటనే రూ.2100 చెల్లించకుంటే రూ.25వేలు జరిమానా విధిస్తామని అన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె మునిసిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మునిసిపల్ సిబ్బంది ఫార్మసీకి చేరుకుని ఫేక్ కాల్‌గా నిర్థారించి ఫిర్యాదు స్వీకరించి వెళ్లారు. అయితే మరికొందరికి కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. నిందితులు సీడీ ఎంఏవెబ్‌సైట్ నుంచి ఫీజు డిమాండ్ నోటీసులను డౌన్‌లోడ్ లేదా ఫొటోలు తీసి అదే విధానంలో సెల్ నెంబర్లు కూడా సేకరిస్తూ ఫోన్లు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.