వైద్యులకు సుస్తీ!
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:44 AM
రోగికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చే వైద్యుడే రోగిగా మారితే? అతడి ప్రాణాలే ప్రమాదంలో పడితే? దేశంలో ప్రస్తుతం రెసిడెంట్ డాక్టర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఏకధాటిగా 36 గంటలపాటు విధులు
నిద్రలేమి, ఒత్తిడి..ఆత్మహత్య ఆలోచనల్లో 16.9శాతం మంది
రెసిడెంట్ వైద్యుల దైన్యం ఇదీ..దేశవ్యాప్త సర్వేల్లో వెల్లడి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రోగికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చే వైద్యుడే రోగిగా మారితే? అతడి ప్రాణాలే ప్రమాదంలో పడితే? దేశంలో ప్రస్తుతం రెసిడెంట్ డాక్టర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఏకధాటిగా రోజుల తరబడి పనిచేస్తూ కంటిమీద కనుకు లేకుండా ఆ డాక్టర్లు నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. మితిమీరిన పనిభారం, నిద్రలేమి, మానసిక ఒత్తిడితో సతమతమవుతూ కుంగుబాటుకు లోనవుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1,260 మంది రెసిడెంట్ డాక్టర్లపై ఫైమా ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. రివ్యూ మెడికల్ సిస్టమ్ 2.0 పేరుతో చేసిన ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఫైమా సోమవారం విడుదల చేసింది. వైద్యరంగంలో కొనసాగుతున్న ‘టాక్సిక్’ పని సంస్కృతిపై ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రెసిడెంట్ డాక్టర్లపై పెను భారం పడుతోంది. ఆ వైద్యులపై 36 గంటల నిర్విరామ డ్యూటీ చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 61.8 శాతం మంది వైద్యులు ఏకధాటిగా 36 గంటలకు పైగా విధుల్లో పాల్గొంటున్నట్లు అంగీకరించారు. 87.8 శాతం మంది డాక్టర్లు నిరంతర డ్యూటీల వల్ల తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నారు. 24 గంటల సుదీర్ఘ డ్యూటీ ముగిశాక కూడా తమకు కనీస విశ్రాంతి లభించడం లేదని 63.7 శాతం మంది వైద్యులు వాపోయారు. పని ఒత్తిడి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా వైద్యుల మానసిక సంతులతనూ దెబ్బతీస్తోంది. 87.5 శాతం మంది వైద్యులు తాము తరచూ తీవ్రమైన మానసిక అలసటకు గురవుతున్నామని చెప్పారు. ఒత్తిడి తట్టుకోలేక 54.4 శాతం మంది తమ రెసిడెన్సీ (పీజీ సీటు) వదిలేసి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. తీవ్రమైన పనిభారం, వేధింపుల కారణంగా 16.9 శాతం మంది రెసిడెంట్ డాక్టర్లు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు. పనిభారమే కాకుండా ఆర్థిక పరమైన అంశాలు కూడా వైద్యులను కుంగదీస్తున్నాయి. కోర్సు మధ్యలో వదిలివెళితే విధించే భారీ జరిమానాలు (బాండ్ పాలసీలు), రాష్ట్రాల మధ్య స్టయిపెండ్‌లలో ఉన్న వ్యత్యాసాలు, సకాలంలో డబ్బులు అందకపోవడం వంటి సమస్యలు రెసిడెంట్లను మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని ఫైమా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, ఇతర ప్రతినిధులు పేర్కొన్నారు. అదే సమయంలోఆస్పత్రుల్లో వీరికి మానసిక మద్దతు ఏ మాత్రం లభించడం లేదని ఆ సర్వే తెలిపింది.
ఫైమా ప్రధాన డిమాండ్లు
రెసిడెంట్ డాక్టర్ల భవిష్యత్తును, రోగుల భద్రతను కాపాడటానికి తక్షణమే జాతీయ స్థాయిలో సంస్కరణలు చేపట్టాలని ఫైమా డిమాండ్ చేసింది. రెసిడెంట్ డాక్టర్ల వారపు డ్యూటీ గంటలపై కచ్చితమైన పరిమితి విధించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 36 గంటల డ్యూటీలు వేయకూడదు. ప్రతి మెడికల్ కాలేజీలో 24-7 మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉంచాలి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్టయిపెండ్ విధానాన్ని అమలు చేయాలి, బాండ్ జరిమానాలను హేతుబద్థీకరించాలి. ఆస్పత్రుల్లో పనిభారం తగ్గ్గించేందుకు అదనపు వైద్యులను, సిబ్బందిని తక్షణమే రిక్రూట్ చేయాలని ఫైమా డిమాండ్ చేసింది. కాగా సరైన నిద్ర, విశ్రాంతి లేకుండా ఒత్తిడిలో ఉండే వైద్యుడు వైద్యచికిత్స చేస్తే.. అందులో ఏదైనా తేడా వస్తే అది రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికేౖనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కంటితుడుపు చర్యలు కాకుండా, రెసిడెంట్ వైద్యుల డ్యూటీ వేళల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యవిద్య నిపుణులు సూచిస్తున్నారు.