భూ సమస్యలు పరిష్కరించకుంటే.. ప్రజాగ్రహం చవిచూడక తప్పదు
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:01 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరంగా బాధితుల పరిస్థితి పెనమ్మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
8 70 లక్షల మంది ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నారు: ఈటల
పంజాగుట్ట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరంగా బాధితుల పరిస్థితి పెనమ్మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. 70 లక్షల మంది ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ధరణి సమస్యలు భూ భారతి పరిష్కరించిందా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈటల రాజేందర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎన్. నర్సింహరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె.గోవర్ధన్, వివిధ పార్టీలు, పలు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాత మారడం లేదని, భూ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమం తప్పదని వక్తలు హెచ్చరించారు.