కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:59 AM
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయి: ఫడణవీస్
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఓటుకు నోటు సాక్ష్యాలు
వాటిని చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర: రాంచందర్‌రావు
కాగజ్‌నగర్/మంచిర్యాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు దోచుకుని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని విమర్శించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో, మంచిర్యాలలో జరిగిన రోడ్ షోలో ఫడణవీస్ మాట్లాడారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రంలో మౌలిక వసతులు అసాధ్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్లనే నేడు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ కమీషన్ల పాలనతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నలిగి పోతున్నారని విమర్శించారు. ప్రజలకు అందుతున్న ఐదు కిలోల బియ్యం, రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటుకు నిధులను కేంద్రమే ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు పెట్టుకుంటుందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్నాయని, రెండుపార్టీలు కలిసి సాక్ష్యాలను మాయం చేయాలనే కుట్రలు పన్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మతాన్ని రెచ్చగొడుతున్నాడని, రాష్ట్రంలో అలజడి సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.