kumaram bheem asifabad- సన్నగిల్లుతున్న ఆశలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:00 PM
వట్టివాగు ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకే అవకాశం కల్పించారు. ఏప్రిల్ నుంచి కాలువల్లో పూడిక తొలగింపు పనుల నేపథ్యంలో మార్చి 31 వరకే వార బందీ ద్వారా నీటి విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. దీంతో ఆయకట్టుదారుల్లో సందిగ్ధత నెలకొంది.
ఆసిఫాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వట్టివాగు ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకే అవకాశం కల్పించారు. ఏప్రిల్ నుంచి కాలువల్లో పూడిక తొలగింపు పనుల నేపథ్యంలో మార్చి 31 వరకే వార బందీ ద్వారా నీటి విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. దీంతో ఆయకట్టుదారుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పుడిప్పుడే వరి నాట్లు మొదలు కాగా మరికొందరు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. చివరి సమయంలో నీటి సరఫరా నిలిచి పోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వయక్తమవుతు న్నాయి. ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లోని 30 గ్రామాల్లో 24,500 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో వట్టివాగు జలాశయాన్ని నిర్మించారు. కుడి ప్రధాన కాలువ పొడవు 21,600 కి.మీలు కాగా 21,800 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ ఏడు కిలో మీటర్లు కాగా 2,700 ఎకరాలకు నీరందేలా రూపొందించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రాజెక్టు నిర్వహణ కొరవడి నిధులు లేక చాలా చోట్ల ప్రధాన కాలువలు, పంపిణీ కాలువలు ధ్వంసమయ్యాయి. సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నంది. కొన్ని గ్రామాల్లో చేల నుంచి వెళ్లే కాలువలను నీరు రావడం లేదని పూడ్చేశారు. కాలువల్లో పూడిక, తుంగ పెరిగి చివరి వరకు నీరు పారడం లేదు.
- 115 రోజుల పాటు..
డిసెంబరు 5వ తేదీ నుంచి మార్చి 31 వరకు 115 రోజుల పాటు వార బందీ ప్రణాలికను అధికారులు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా డీ3, డీ5, డీ6, డీ8 కాలువలకు, రెండో విడత డి1,డి4, డి9, డి10, డి11, డి12 కాలువలకు నీరు విడుదల చేస్తున్నారు. కానీ కొన్ని కాలువల్లో చాలా చోట్ల పూడిక నిండి తుంగ పెరగడంతో చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది రైతులు సాగుకు దూరం కావడంతో వరి విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తోంది. కాగా ప్రాజెక్టు ప్రధాన కాలువలతో పాటు పంపిణీ కాలువల్లో పూడిక తీత కోసం ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌తో ఏప్రిల్, మే నెలల్లో పూడిక తొలగింపు చేపట్టేలా నీటి పారుదల శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మార్చి 31 వరకు నీరు అందించేలా ప్రణాళిక ఖరారు చేశారు. ఆయకట్టుదారులు వరి మినహా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు సూచించారు. అం టే పెసర, జొన్న, మొక్కజొన్న, శనగ తదితర పంట లు వేసుకోవాలి. కానీ ఇటువంటి పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కొందరు వరికే మొగ్గు చూపు తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తే కొంత మేర మార్పు జరిగే అవకాశం ఉంది.