28, 30, 31 తేదీల్లో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:20 AM
ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజుల్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్న అంచనాతో అదనపు స్లాట్లు కేటాయిస్తూ, పని వేళలు పెంచుతూ.....
అదనపు స్లాట్ల కేటాయింపు.. పని వేళల పెంపు
హైదరాబాద్, మార్చి26 (ఆంధ్ర జ్యోతి): ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజుల్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్న అంచనాతో అదనపు స్లాట్లు కేటాయిస్తూ, పని వేళలు పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 28, (29 ఆదివారం సెలవు) 30, 31 తేదీల్లో స్లాట్ల సంఖ్యను, పని వేళలను పొడిగించాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పని వేళలను ఈ మూడు రోజుల్లో ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటలకు పొడిగించారు. గతంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పని వేళల ఆధారంగా 48 స్లాట్లు ఉండేవి. ఐదు వాకిన్ కింద అనుమతించే వారు. పని వేళలు పెంచడం వల్ల మరో 40 స్లాట్ల వరకు అదనంగా కేటాయించేందుకు అవకాశం ఏర్పడింది. మరో వైపు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా తొలిసారి రూ.15 వేల కోట్లు దాటింది. గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం రూ.14,214 కోట్లు కావడం గమనార్హం.