24న జరగాల్సిన టాడి ఫెస్టివల్ రద్దు
ABN , Publish Date - May 23 , 2026 | 05:01 AM
తన స్వార్థం కోసం టాడీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఎవరైనా రుజువు చేస్తే రూ.కోటి నజరానా ఇస్తానని ఎక్స్‌పీరియం ఎకోఫ్రెండ్లీ పార్కు ఎండీ రాందేవ్‌రావు సవాల్ విసిరారు.
ఆ ఫెస్టివల్ నిర్వహణలో నా స్వార్థం లేదు
ఉందని ఎవరైనా నిరూపిస్తే కోటి నజరానా ఇస్తా
మీడియాతో ఎక్స్‌పీరియం పార్కు ఎండీ రాందేవ్‌రావు
శంకర్‌పల్లి, మే 22(ఆంధ్రజ్యోతి): తన స్వార్థం కోసం టాడీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఎవరైనా రుజువు చేస్తే రూ.కోటి నజరానా ఇస్తానని ఎక్స్‌పీరియం ఎకోఫ్రెండ్లీ పార్కు ఎండీ రాందేవ్‌రావు సవాల్ విసిరారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 24న నిర్వహించతలపెట్టిన టాడీ ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఎక్స్‌పీరియం ఎకోఫ్రెండ్లీ పార్కులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్లుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రాండ్ ఇమేజ్ తేవాలన్న ఉద్దేశంతోనే టాడీ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నట్లు తెలిపారు. కల్లు వ్యాపారం చేయాలనే ఉద్దేశంగానీ, అందులో భాగస్వామ్యం కావాలనే ఆశ గానీ.. తనకు లేదని స్పష్టం చేశారు. తాటి, ఈత చెట్లను పెంచడం ద్వారా రైతులకు ఆర్థికంగా బలోపేతమవుతారని, ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుందని ఆకాంక్షించినట్లు తెలిపారు. కానీ, కల్లును కృత్రిమంగా తయారు చేసే వారు.. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళనతోనే పనికట్టుకుని బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కల్లును రాష్ట్ర పానీయంగా ప్రకటించాలని, స్టార్ హోటళ్లు, బార్లలో అమ్మేందుకు ప్రభు త్వం చొరవ చూపాలన్నారు. కర్ణాటకలో ఇటీవల ప్రభుత్వం కల్లుబార్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తాను స్వతహాగా వృక్ష ప్రేమికుడినని అందులో భాగంగానే ఎక్స్‌పీరియం ఎకోప్రెండ్లీ పార్కును నెలకొల్పానని తెలిపారు. 85 దేశాల్లో పర్యటించి 270 రకాల తాటి, ఈత చెట్లను తీసుకువచ్చి ఎక్స్‌పీరియం పార్కులో పెంచుతున్నానని, వాటితో వ్యాపారం చేయడం లేదని గుర్తు చేశారు.