Share News

ప్రకృతి ఒడిలో ఓ రోజు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:58 AM

ఉరుకులు, పరుగుల జీవితం, పట్టణాల్లోని కాంక్రీట్‌ జంగిల్‌ నుంచి కాసేపైనా బయట పడాలని, ప్రకృతి ఒడిన సేదతీరాలని చాలా మంది కోరుకుంటారు.

ప్రకృతి ఒడిలో ఓ రోజు

  • అనంతగిరి అడవుల్లో టూరిజం ప్యాకేజీ.. ‘బ్రీజ్‌’ పేరుతో ప్రారంభం

  • సఫారీ, ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంప్‌లు

  • పర్యాటకుల కోసం లగ్జరీ టెంట్లు, కాటేజీలు

  • ‘బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌’, పలు రకాల వంటకాలతో భోజనం, క్యాంప్‌ ఫైర్‌

  • ఒక్కరికి రూ.5వేలు.. నలుగురున్న కుటుంబానికి రూ.10,100 చార్జి

వికారాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఉరుకులు, పరుగుల జీవితం, పట్టణాల్లోని కాంక్రీట్‌ జంగిల్‌ నుంచి కాసేపైనా బయట పడాలని, ప్రకృతి ఒడిన సేదతీరాలని చాలా మంది కోరుకుంటారు. హైదరాబాద్‌ సమీపంలో అందుకు అనువైన ప్రాంతం అనంతగిరి కొండలు. ఇలాంటి వారికోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అనంతగిరి అడవుల్లో ‘ద బ్రీజ్‌’ పేరుతో కొత్త టూరిజం ప్యాకేజీని ప్రారంభించింది. అడవుల్లో తిరగడం, ట్రెక్కింగ్‌, పక్షులను వీక్షించడం, నైట్‌ క్యాంపు, సఫారీ, బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌ లాంటి అంశాలను ఇందులో చేర్చింది. అడవుల్లో ఉదయం పూట ఆరుబయట పచ్చని గడ్డి మైదానాల్లో దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య టిఫిన్‌ చేసే ‘బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌’ ఈ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ‘డక్కన్‌ వుడ్స్‌ అండ్‌ ట్రయిల్స్‌’ ఈ టూరిజం ప్యాకేజీని అమలు చేస్తోంది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, ఔత్సాహిక సాహస యాత్రికులను ‘బ్రీజ్‌’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని విధంగా టూరిస్టుల కోసం ఇక్కడ ఎకో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. జంగల్‌ కాటేజీలను నిర్వహించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సేవలందించేందుకు ఫారెస్ట్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన వారిని ఎంపిక చేసి వారికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బ్రీజ్‌ టూరిజం ప్యాకేజీలో పర్యాటకులు మధ్యాహ్నం ఒంటి గంటకు చెక్‌ ఇన్‌ అయితే, మరుసటి రోజు మధ్యాహ్నం 11 గంటలకు చెక్‌ అవుట్‌ అవుతారు. ఇందుకోసం పర్యాటకులు ముందుగా ఆన్‌లైన్‌లో ఠీఠీఠీ.ఛ్ఛీఛిఛ్చిుఽఠీౌౌఛీట్చుఽఛ్టీట్చజీజూట.ఛిౌఝ వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాలి.


సఫారీ..10కిలోమీటర్లు

పర్యాటకులు తాము ఎంచుకున్న రోజున మధ్యాహ్నం ఒంటిగంటకల్లా నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వారికి టూర్‌ నిర్వాహకులు 1.30గంటలకు 10రకాల వంటకాలతో భోజనం అందిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి. ఆ తర్వాత సాయంత్రం 6.30 వరకు కొండలు ఎక్కడం, పక్షులను చూడటం, సూర్యాస్తమయ వీక్షణ ఉంటాయి. రాత్రి 7.30 గంటలకు క్యాంప్‌ ఫైర్‌ వేస్తారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పిస్తారు. రాత్రి 8.45 గంటలకు వెజ్‌/నాన్‌వెజ్‌ భోజనం అందిస్తారు. రాత్రి అక్కడే టెంట్లలో బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేపుతారు. 5.45 గంటలకు సఫారీ ప్రారంభమై సుమారు 10 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. తర్వాత అక్కడ ఉన్న చిన్న జలపాతాల సందర్శన ఉంటుంది. 8.45 గంటలకు అటవీ ప్రాంతంలోనే బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తారు. బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కింద పర్యాటకులకు వెజ్‌ చీజ్‌ సాండ్‌విచ్‌, ఉడికించిన గుడ్లు, బ్రెడ్‌ ఆమ్లెట్‌, టీ లేదా కాఫీ ఇస్తారు. పర్యాటకులు 11 గంటలకు చెక్‌ అవుట్‌ అవుతారు. ఒక్కరికి రూ.5 వేలు, ఇద్దరికి రూ.7,600, ముగ్గురు, లేదా నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.10,100గా ప్యాకేజీ రేట్లను నిర్ణయించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:58 AM