Share News

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు

ABN , Publish Date - May 31 , 2026 | 01:33 AM

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోషకాహార కేంద్రాలుగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల సేవలు ఎంతో అవసరం. అయితే ఖాళీల భర్తీ ఊరిస్తోంది. గత సంవత్సరం మహిళా దినోత్సవం రోజే నోటిఫికేషన్‌ ఇస్తామని మహిళా సంక్షేమ

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోషకాహార కేంద్రాలుగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల సేవలు ఎంతో అవసరం. అయితే ఖాళీల భర్తీ ఊరిస్తోంది. గత సంవత్సరం మహిళా దినోత్సవం రోజే నోటిఫికేషన్‌ ఇస్తామని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించడంతో ఆశలు చిగురించాయి. మరోసారి ఇందుకు సంబంధించి నివేదికలను రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ ప్రభుత్వానికి పంపించింది. అంగన్‌వాడీల్లో కొలువుల పండుగ మొదలు కాన్నుట్లు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో అశలు రేకెత్తిస్తున్నాయి. గర్భిణి, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ విద్య కేంద్రాలుగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే జిల్లాలో కొన్ని కేంద్రాలను ప్రీస్కూల్‌గా మార్చారు. అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ విద్య అందించే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 40 వేల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. అరోగ్యలక్ష్మి ద్వారా 18,645 మందికి పౌష్టికాహారం, ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, హోం రేషన్‌ అందిస్తున్నారు. 15,804 మంది చిన్నారులకు ఒక్కపూట సంపూర్ణభోజనం, గుడ్డు, పాలు కుర్‌కురే వంటి స్నాక్స్‌ అందిస్తున్నారు. జిల్లాలో సమర్థవంతంగా అంగన్‌ వాడీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

ఫ 57 టీచర్లు, 181 ఆయా పోస్టులు ఖాళీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 20 మినీ కేంద్రాలు ఉండగా వాటిని పూర్తి స్థాయి కేంద్రాలుగా మార్చారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో రిటైర్‌మెంట్‌ పక్రియను అమల్లోకి తేవడంతో జిల్లాలో 122 పోస్టులు ఖాళీ అయ్యాయి. గతంలో ఉన్న ఖాళీలతో కలుపుకుని జిల్లాలో 238 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందులో 57 టీచర్లు, 181 ఆయాలు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ, అయాల భర్తీకి సంబంధించి గతంలో విద్యార్హతల్లో టీచర్లకు పదవ తరగతి, ఆయాలకు 7వ తరగతి అర్హతగా ఉంది. ఫ్రీ స్కూల్‌గా మార్చి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పూర్వ విద్యను అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి టీచర్లు, ఆయాలకు ఇంటర్‌ అర్హతగా నిర్ణయించారు. టీచర్లు, ఆయాలకు వయస్సు 18 నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఖాళీల నివేదికలను ప్రభుత్వానికి పంపించారు.

ఫ 43 వేల మందికి లబ్ధి

జిల్లాలో 586 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో 362 కేంద్రాలు, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 224 కేంద్రాలు ఉన్నాయి. రెండు ప్రాజెక్టులు పరిధిలో 43 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 6 సంవత్సరాలలోపు చిన్నారులు 3,091 మంది, 7 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 16,980 మంది, 3 నుంచి 6 సంవత్సరాల వరకు చిన్నారులు 17,338 మంది ఉన్నారు. గర్భిణులు 3,793 మంది, బాలింతలు 2,430 ఉన్నారు. వీరికి ప్రతినెలా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు టీకాలు వేయిస్తున్నారు. నిరంతరంగా సాగుతున్న పోషకా హారం పంపిణీలో ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించారు.

ఫ అల్పాహారం అందించేందుకు సన్నాహాలు

చిన్నారులకు ఆటపాటలతో ప్రీప్రైమరీ విద్యను అందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని తొలి ముద్ద బ్రేక్‌ ఫాస్ట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు. వేసవి సెలవుల తర్వాత అంగన్వాడి కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంగన్‌వ్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజు ఉడికిం చిన కోడిగుడ్డు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో చిన్నారులు ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఏమీ తినకుండానే అంగన్వాడీ కేంద్రాలకు వస్తుంటారు. వీరికి బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు. ఇందులో ఉప్మా, కిచిడి అందిస్తారు. ప్రభుత్వమే పోషకాల మిశ్ర మం కలిగిన సామగ్రి పంపిస్తుంది. చిన్నారుల ఎత్తు, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటు న్నారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద కుటుంబాల చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Updated Date - May 31 , 2026 | 01:33 AM