reservations: రిజర్వేషన్లపై కసరత్తు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:21 AM
పురపాలికల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం మరో కీలక ఘట్టానికి సర్వం సిద్ధం చేస్తోంది. 13వ తేదీ నుంచి అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
త్వరలోనే పుర ఎన్నికలకు షెడ్యూల్
సన్నాహాలు చేస్తున్న ఎన్నికల సంఘం
ఏ వార్డు ఏ రిజర్వేషన్‌కు ఖరారవుతుందోనని చర్చ
అన్ని పార్టీలకుప్రతిష్ఠాత్మకం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : పురపాలికల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం మరో కీలక ఘట్టానికి సర్వం సిద్ధం చేస్తోంది. 13వ తేదీ నుంచి అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందగానే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
గ్రామ పంచాయతీల ఎన్నికల మాదిరిగానే 2011 జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిటీ సర్వే ప్రకారం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అయితే బీసీలకు పార్టీల పరంగానే 42శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మునిసిపల్ ఎన్నిక ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందరి దృష్టి రిజర్వేషన్ల వైపు మళ్లింది. పురపాలికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల్లోని ఆశావహులతో పాటు స్వతంత్రులుగా పోటీ చేయాలనుకుంటున్న వారు వార్డుల్లో ఏ రిజర్వేషన్ ఖరారవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు వార్డు ల్లో హడావుడి చేసిన వారు రిజర్వేషన్ అనుకూలించకుంటే పరిస్థితి ఏంటనిఆలోచిస్తున్నారు.
పరపతి, ఆర్థిక బలమే కీలకం
ఇప్పటికే ప్రధాన పార్టీలు పురపాలికల్లో వార్డుల వారీగా సర్వే చేయించాయి. ఏ వార్డులో ఎవరికి ఎక్కువగా పరపతి ఉంది? ఎన్నికల ఖర్చు భరించగలరా? అక్కడ ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకునే ప్రయత్నాలు చేయాలా? ఎదుటి పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? తదితర అంశాలపై సర్వేల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. కచ్చితంగా గెలవాలంటే ఎలా ముందుకెళ్లాలో ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఖరారు కాకముందే వీరే అభ్యర్థని శ్రేణులకు చెబుతున్నారు. దీంతోపాటు ఆన్‌రిజర్వుడు వస్తే ఫలానా అభ్యర్థి అని, బీసీ, ఎస్సీ వస్తే అభ్యర్థిగా ఎవరుండాలో పార్టీ కీలక నేతలు సమాలోచనలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక తిరుగుబాటు ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో ముందుగానే సర్దుబాటు ధోరణిలో వెళ్లాలని ఆశావహులకు సూచిస్తున్నారు. ప్రధానంగా బరిలో నిలిచేందుకు పరపతి, ఆర్థిక బలానికి ప్రాధాన్యం ఇస్తూ అన్ని పార్టీల నేతలు అభ్యర్థులను ముందస్తుగానే అంతర్గతంగా ఖరారుచేస్తున్నారు.
అభ్యర్థుల కోసం ఆరా..
జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో మొత్తం 104 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆలేరు మునిసిపాలిటీ పరిధిలో 12 వార్డులు, భువనగిరిలో 35, చౌటుప్పల్‌లో 20, మోత్కుర్‌లో 12, భూదాన్‌పోచంపల్లిలో 13, యాదగిరిగుట్టలో 12 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డు నుంచి కనీసం 10మంది వరకు బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 1,000కి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన నేతలు మాత్రం అన్ని కేటగిరీల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోటీ చేయాలనుకుంటున్న వారితో స్థానికంగా ప్రజాబలానికి తోడు ఆర్థికంగా ఉన్న వారెవరనే విషయాన్ని అంతర్గ త సమీక్షల్లో చర్చించుకుంటున్నారు. అలాంటి వారి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో రిజర్వేషన్ల ప్రకారం ప్రత్యర్థి పార్టీ నుంచి బరిలో దిగేది ఎవరో అంచనా వేసుకుంటున్నారు. మరో వైపు టికెట్ లభించకుంటే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లే వారు, రెబల్స్‌గా పోటీచేసే వారు ఉంటారా? అనే విషయంపై లోతుగా చర్చిస్తున్నారు. పంచాయ తీ ఎన్నికల్లో ఇలాంటి అంశాలను నేతలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో కొన్నిచోట్ల పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరికొన్ని చోట్ల రెబల్స్ విజయం సాధించారు. దీంతో పురపాలిక ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా కీలక నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
మునిసిపాలిటీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీ గుర్తులతో జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు, ఇతరులు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రధాన పార్టీలు అన్ని చోట్ల పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, వామపక్షాలు, ఇతర పార్టీలు బలం ఉన్న చోట బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందస్తుగా పూర్తిచేసుకుంటున్నా యి. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో బీఆర్‌ఎస్ అధిష్టానం ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసింది. బీజేపీ కూడా రాష్ట్ర నాయకులతో సమావేశాలు నిర్వహించి మెజార్టీ స్థా నాలు గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పట్టణాల్లో పురపోరు రసవత్తరంగా మారింది.