Share News

పెట్రో ధరల నియంత్రణకే ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:19 AM

అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, మనదేశంలో ప్రస్తుత ధరలు మరింత పెరగకుండా ఉండేందుకే కేంద్రం వాటిపై ఎక్సైజ్‌ సుంకాన్ని...

పెట్రో ధరల నియంత్రణకే ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు

  • లాక్‌డౌన్‌ సమస్యే ఉత్పన్నం కాదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/పద్మారావునగర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, మనదేశంలో ప్రస్తుత ధరలు మరింత పెరగకుండా ఉండేందుకే కేంద్రం వాటిపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. వాహనదారులకు నేరుగా ప్రయోజనం కలగకున్నా, కంపెనీలపై అదనపు భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశం కూడా ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపునకు కారణమన్నారు. దేశంలో అవసరాలకు అనుగుణంగా రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. శనివారం కవాడిగూడలోని సీజీవో టవర్స్‌ పీఐబీ కార్యాలయంలో ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లతో కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం పెట్రో డీలర్లకు 3 రోజుల క్రెడిట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీంతో వారిపైనా ఆర్థికభారం పడకుండా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ సమస్యే ఉత్పన్నం కాబోదని స్పష్టం చేశారు. డీజిల్‌ వినియోగం తగ్గించేందుకు ఈవీ వాహనాలను, ఎలక్ట్రికల్‌ రైళ్లను పెంచుతున్నట్లు తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల కోసం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోలు, డీజిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అత్యధిక వ్యాట్‌ (35.20శాతం) వసూలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకలో వ్యాట్‌ 29శాతమే ఉందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా వ్యాట్‌ వసూలు చేసిందని, ప్రస్తు త కాంగ్రెస్‌ కూడా నయాపైసా తగ్గించలేదని ఆయన ఆరోపించారు.

Updated Date - Mar 29 , 2026 | 06:20 AM