ఎక్సైజ్ శాఖలో సమసిన వివాదం
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:58 AM
ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై బుధవారం ఎక్సైజ్ కమిషనర్‌ను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కలిశారు.
కమిషనర్‌ను కలిసిన జేఏసీ నేతలు
ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై బుధవారం ఎక్సైజ్ కమిషనర్‌ను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. కమిషనర్‌ను వివరణ కోరగా.. బదిలీల ఒత్తిడికి లోనై ఒక అధికారిని పనిలో భాగంగా ఒక మాట అన్నానని, ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని, ఈ విషయంపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపినట్లు జేఏసీ నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో కొంతమంది రాష్ట్ర, జిల్లా అధికారులు కూడా కింది స్థాయి ఉద్యోగులపై మాటలు తూలుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, వారు కూడా పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. రాజకీయ నేతలు కూడా ఎక్సైజ్ శాఖ విషయంలో జోక్యం చేసుకుని వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్, జనగామ కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారితో సహా మరికొందరు కిందిస్థాయి సిబ్బందిపై మాటలు జారుతున్నారని వారి పద్ధతి మార్చుకోకుంటే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.