Share News

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:20 AM

గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి

  • స్మగ్లర్ల దాడిలో గాయపడి 7 రోజులుగా నిమ్స్‌లో చికిత్స

  • నేడు స్వగ్రామం మోస్రాలో అంత్యక్రియలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాత్రి 9.41 గంటల సమయంలో మరణించారని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌ వెల్లడించారు. మృతురాలి కుటుంబసభ్యులకు నిమ్స్‌ యాజమాన్యం తరఫున సానుభూతి తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలోని సౌమ్య సొంతూరు మోస్రాలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. జనవరి 23న రాత్రి నిజామాబాద్‌ శివారులో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ సీఐ స్వప్న, కానిస్టేబుల్‌ సౌమ్య, ఇతర సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కారులో వస్తున్న స్మగ్లరు వీరిని గమనించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సీఐ స్వప్న, సౌమ్య వారి కారును అడ్డుకునేందుకు యత్నించగా.. దుండగులు నేరుగా వీరిపైకే కారును పోనిచ్చారు. ఈ క్రమంలో స్వప్న తప్పించుకోగా.. సౌమ్యపైకి కారు ఎక్కించారు. తిరిగి రివర్స్‌ చేస్తున్న సమయంలో సౌమ్యపైకి మరోసారి ఎక్కించగా.. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కిడ్నీ, ప్లీహం తొలగించారు. పరిస్థితి విషమిస్తుండటంతో అదే నెల 25 నిమ్స్‌కు తరలించారు. అప్పట్నుంచి ఆమెకు వివిధ విభాగాల వైద్య నిపుణులు అత్యాధునిక చికిత్సలను అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.

Updated Date - Feb 01 , 2026 | 06:21 AM