ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:50 AM
నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా....
సీఎం రేవంత్‌తో చర్చించి తుది నిర్ణయం
ఉద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి జూపల్లి
సౌమ్యను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది: మంత్రి దామోదర
నిమ్స్‌లో సౌమ్య, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు
హైదరాబాద్ సిటీ, నిమ్స్, సుభాష్ నగర్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రవణ్‌ను పరామర్శించి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సౌమ్య సంపూర్ణంగా కోలుకుంటుందని ఆశిస్తున్నామని, ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. సౌమ్య వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తెలిపారు. కొన్ని సందర్భాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందని, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏడాదిలోనే 2457 మందిపై కేసులు నమోదు చేశామని, ఒక్క నిజామాబాద్‌లోనే 110 మందిపై 70 కేసులు నమోదయ్యాయన్నారు. సౌమ్యను పరామర్శించిన అనంతరం మంత్రి దామోదర మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, అయితే వైద్యుల చికిత్సతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. సౌమ్య ఒక కిడ్నీ, ప్లీహాన్ని తొలగించినట్టు చెప్పారు. కాగా సహాయత ట్రస్టు నుంచి సౌమ్య చికిత్సకు తక్షణం రూ.10 లక్షలు మంజూరు చేసినట్టు ఎక్సైజ్‌శాఖ కానిస్టేబుల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజిరెడ్డి తెలిపారు.