Share News

స్టెరాయిడ్స్‌తో కంటికి చేటు

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:40 AM

చర్మ వ్యాధులు, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలకు వైద్యులు సిఫారసు చేసే స్టెరాయిడ్‌ ఔషధాలను.. వారు సిఫారసు చేసినదానికన్నా ఎక్కువ కాలం వాడేస్తుంటారు కొందరు....

స్టెరాయిడ్స్‌తో కంటికి చేటు

  • విచ్చలవిడి వినియోగంతో గ్లకోమా బారిన పడే ముప్పు

  • ‘ఆప్టిక్‌ నర్వ్‌’కు శాశ్వత నష్టం.. నిర్లక్ష్యంతో అంధకారం

  • బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ ఉన్నవారు.. స్టెరాయిడ్స్‌ వాడేవారు ఏడాదికొకసారి పరీక్షలు చేయించుకోవాలి

  • 40 ఏళ్లు దాటినవారు రెండేళ్ల్లకోసారి కంటి పరీక్షలు

  • నేత్ర వైద్య నిపుణుల సూచన

హైదరాబాద్‌ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): చర్మ వ్యాధులు, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలకు వైద్యులు సిఫారసు చేసే స్టెరాయిడ్‌ ఔషధాలను.. వారు సిఫారసు చేసినదానికన్నా ఎక్కువ కాలం వాడేస్తుంటారు కొందరు! అప్పటికి తగ్గినా.. మళ్లీ ఆ సమస్య రాగానే వైద్యుడి వద్దకు వెళ్లకుండా మందుల దుకాణానికి వెళ్లి తెచ్చుకుని వేసేసుకుంటారు మరికొందరు!! అలా స్టెరాయిడ్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం కంటికి చేటు చేస్తుందని.. కంటినరాలపై ఒత్తిడి పెంచి గ్లకోమాకు, శాశ్వత అంధత్వానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని కంటి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా జనవరి నెలను ‘గ్లకోమా అవగాహన మాసం’గా పాటిస్తున్న నేపథ్యంలో.. మన దేశంలో కూడా నేత్ర వైద్య నిపుణులు గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో సెకండరీ గ్లకోమాకు స్టెరాయిడ్స్‌ అతి వినియోగమే ప్రధాన కారణంగా మారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన2-3 సంవత్సరాలుగా, వృద్ధాప్యం, మధుమేహం, మయోపియా (దగ్గరి చూపు లోపం) పెరగడం, మెరుగైన పరీక్షా విధానాల వల్ల గుర్తిస్తున్న గ్లకోమా కేసుల సంఖ్య పెరిగిందని, వాటిలో చాలా కేసులు దీర్ఘకాలిక, పర్యవేక్షణ లేని స్టెరాయిడ్‌ వాడకం వల్ల వచ్చే ‘సెకండరీ గ్లకోమా’ కేసులేనని వారు పేర్కొంటున్నారు. దేశంలో 85 నుంచి 90 శాతం గ్లకోమా కేసుల్లో లక్షణాలు కనిపించే సరికే ‘ఆప్టిక్‌ నర్వ్‌’కు శాశ్వత నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఏటా (లేదా) రెండేళ్లకొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని.. ముఖ్యంగా డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ (బీపీ), థైరాయిడ్‌ సమస్యలు, అధిక మయోపియా, హైపర్‌మెట్రోపియా (దూరపు చూపు లోపం) ఉన్నవారు, దీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడేవారు, చిన్నతనంలో కంటికి దెబ్బ తగిలిన వారు తప్పనిసరిగా ఏటా కంటి స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వీరికి కేవలం విజన్‌ టెస్టులు చాలవని.. కంటి ఒత్తిడి, కంటి నాడి ఆరోగ్యాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గ్లకోమాను తొలిదశలో గుర్తించడానికి కీలకం గ్లకోమా వల్ల వచ్చే చూపు నష్టాన్ని తొందరగా గుర్తించి చికిత్స చేస్తే నివారించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.


అధ్యయనం ప్రకారం..

సాధారణంగా.. 40 ఏళ్లు దాటినవారిలో.. 50-70 ఏళ్లవారిలో ఎక్కువగా గ్లకోమా సమస్య వస్తుంది. కానీ, ఇటీవలికాలంలో చిన్నపిల్లల్లో, 40 ఏళ్లలోపువారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. ఉదాహరణకు.. కంటి అలర్జీతో బాధపడుతున్న 4062 మంది పిల్లలకు ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ గతంలో పరీక్షలు నిర్వహించగా వారిలో 2.2 శాతం మందికి స్టెరాయిడ్‌ వల్ల గ్లకోమా వచ్చినట్టు తేలింది. ఆ పిల్లల్లో 30 కంటే ఎక్కువ మందికి.. ఆస్పత్రికి వచ్చే సమయానికే చూపు దెబ్బతిందని వైద్యులు వివరించారు. వారంతా వైద్యుల సిఫారసు లేకుండా (లేదా) నిర్ణీత కాలానికి మించి స్టెరాయిడ్‌లను వినియోగిస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. స్టెరాయిడ్‌లు ఇంజెక్షన్లు, మాత్రల రూపంలోనే కాక.. కంటిచుక్కలు, ఇన్హేలర్ల రూపాల్లో కూడా ఉంటాయని.. కొన్ని చర్మ క్రీములు, మొటిమలు/దురద నివారణ క్రీముల్లో కూడా స్టెరాయిడ్స్‌ ఉంటాయని వారు పేర్కొంటున్నారు. ఇటీవలికాలంలో కొన్ని ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో రహస్యంగా స్టెరాయిడ్‌లు కలుపుతున్నారని.. అలాంటివి చాలాసార్లు సరైన లేబులింగ్‌ లేకుండానే లభిస్తాయని, కొన్ని ఔషధాల్లో సైతం అనుమతి లేకుండా స్టెరాయిడ్‌లు కలుపుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి స్టెరాయిడ్‌లను ఏ రూపంలో వినియోగించినా తప్పనిసరిగా పూర్తిస్థాయి కంటి పరీక్ష చేయించుకోవాలని.. వాటి ప్రభావంతో గ్లకోమా ఏర్పడినట్టు తేలితే వైద్యులు స్టెరాయిడ్‌లకు బదులుగా ఇతర మందులను సూచించి, గ్లకోమాకు తగిన చికిత్స అందించడానికి అవకాశముందని వివరించారు.

ఎలాంటి లక్షణాలూ కనిపించవు

స్టెరాయిడ్‌ ప్రేరిత గ్లకోమా కేసులు పెరుగుతున్నట్లు తాము గుర్తించామని.. రోగులకు మొదట్లో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలూ కనపడవని, తమకు అంతా బాగానే ఉన్నట్టు వారికి అనిపిస్తుందని.. కానీ, స్టెరాయిడ్స్‌ వల్ల వారిలో కంటి ఒత్తిడి నిశ్శబ్దంగా పెరిగిపోతూ, శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ ఆస్పత్రి గ్లకోమా సర్జన్‌, డాక్టర్‌ కౌసల్య చెప్పారు. చూపు తగ్గిపోవడం, తరచుగా కళ్లద్దాలు మార్చాల్సి రావడం, లేదా వెలుతురు చుట్టూ వలయాలు కనిపించడం వంటి ‘గ్లకోమా’ ముందస్తు లక్షణాలను చాలామంది రోగులు పట్టించుకోరని.. సెంట్రల్‌ విజన్‌ (నేరుగా చూసే చూపు) మొదట్లో ప్రభావితం కాకపోవడం వల్ల, వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స ఆలస్యమవుతుంది,ు అని డాక్టర్‌ కౌసల్య తెలిపారు. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ (బీపీ), థైరాయిడ్‌ సమస్యలు, అధిక మయోపియా, హైపర్‌మెట్రోపియా (దూరపు చూపు లోపం) ఉన్నవారు, దీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడేవారు, చిన్నతనంలో కంటికి దెబ్బ తగిలిన వారు అధిక రిస్క్‌ జోన్‌లో ఉంటారని, అలాంటివారు ఏటా తప్పనిసరిగా కంటి స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - Jan 24 , 2026 | 04:40 AM