kumaram bheem asifabad-మోతాదు మించితే ప్రమాదమే
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:35 PM
పంటల సాగులో మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించకూడదని వ్యవసాయాధికారులు తరుచూ సూచిస్తున్నా రైతులు పాటించడం లేదు. రసాయనిక ఎరువులు, పెరుగుల మందులు విచక్షణారహితం గా వినియోగిస్తున్నందున భూ సారం దెబ్బతిన్నడంతో దిగుబడులు సైతం తగ్గిపోతున్నా యని అధికారులు చెబుతున్నారు.
- క్షీణిస్తున్న భూ సారం
- సహజ సిద్ధమైన ఎరువులతోనే దిగుబడులు
- అధికారుల సూచనలు పాటిస్తే ప్రయోజనం
వాంకిడి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించకూడదని వ్యవసాయాధికారులు తరుచూ సూచిస్తున్నా రైతులు పాటించడం లేదు. రసాయనిక ఎరువులు, పెరుగుల మందులు విచక్షణారహితం గా వినియోగిస్తున్నందున భూ సారం దెబ్బతిన్నడంతో దిగుబడులు సైతం తగ్గిపోతున్నా యని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పత్తి 3,70,919 ఎకరాల్లో, వరి 42,228, కంది 20,081 ఎకరాల్లో, సోయా 1336 ఎకరాల్లో, మొక్కజోన్న 668 ఎకరాల్లో, 11,254 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నారు. కాగా జిల్లాలో అధికంగా పత్తి సాగవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొంత మేర దెబ్బతీ శాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో పత్తి మొక్కల ఎదుగుదల తగ్గిపోయింది. చీడపీడల బెడద కూడా అధికంగా ఆశించే ప్రమా దముంది. దీంతో రైతులు ఇప్పటి నుంచే రసాయన ఎరువుల వాడకంపై దృష్టి పెడు తున్నారు. అధిక మోతాదుల్లో రసాయన ఎరువులు, పురుగుల మందులు విచక్షణారహితంగా వినియోగిస్తున్నందున పంటల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవల్సిన పరిస్థితి కలుగుతోంది .
- సాగు సమయంలోనే..
పంటసాగుచేసే సమయంలోనే రైతులు తప్పటడుగులు వేస్తున్నారు. భూసార పరీక్షలు చేయించకుండానే పంటలు వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పట్టించుకోవడంలేదు. ఆపై వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడికూడా చేతికి రావడంలేదు. అలా కాకుండా వ్యవసాయ అధికారుల సూచనల మెరకు భూసార పరీక్షలు చేయించి ఆపై ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తే మేలు జరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా చాలా మంది రైతులకు పురుగు మందుల వాడకంపై అవగాహన ఉండడంలేదు. స్థానిక ఎరువుల డీలర్లు, వ్యాపారులు చెప్పె మందులనే పిచికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కోరకంగా ఉంటుంది. పిచికారి చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏ పురుగుకు ఏ మందు వాడాలో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన కలిగి ఉంటే కొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారి చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. పిచికారి చేసిన మందు శరీంలోకి వెళ్తే నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ దెబ్బతిని వాంతులు, తలనొప్పులు వచ్చి అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మందులు పిచికారీ చేసే సమయంలో ముక్కుకు, నోటికి మాస్కులు ధరించాలి, చేతికి గ్లౌజులు వేసుకోవాలి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కొన్న తరువాత భోజనం చేయాలి, వ్యవసాయ అధికారులు సూచనాలను పాటించాలి.
- సేంద్రియ ఎరువులు..
సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరగడంతో పాటు దీర్ఘకాలంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. రసాయన ఎరువుల, పురుగుల మందుల వాడకంతో ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంతో పర్యావరణానికి మేలు చేకూరి పెట్టుబడి భారం తగ్గుతుంది. పురుగుల మందులు కొనుగోలు చేసేటప్పడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి..
- గోపికాంత్, వాంకిడి వ్యవసాయ అధికారి
పంటలపై పురుగుల మందులు వేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంలో ముందుస్తు సలహాలు తీసుకోవాలి. రైతులు ఇష్టాను సారంగా ఎరువులు, పురుగు మందుల వాడితే పంట దెబ్బతిని దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంటసాగుకు ముందు భూసార పరీక్షలు చేయిస్తే మేలు.