Share News

బీజేపీకి ఆరూరి రమేశ్‌ రాజీనామా

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:53 AM

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పంపించారు.

బీజేపీకి ఆరూరి రమేశ్‌ రాజీనామా

  • రేపు బీఆర్‌ఎ్‌సలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

  • గత పార్లమెంట్‌ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఎంపీగా పోటీ

వరంగల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పంపించారు. ఆరూరి రమేశ్‌ వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018లో రెండు పర్యాయాలు విజయం సాధించారు. 2021లో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసిన ఆరూరి.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీగా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ బీఆర్‌ఎస్‌ అఽధిష్ఠానం కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్‌ కావ్య వైపు మొగ్గు చూపింది. దీంతో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరూరి రమేశ్‌.. 2024 మార్చి 17న అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తర్వాత కడియం కావ్య కాంగ్రె్‌సలో చేరి వరంగల్‌ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆరూరి రమేశ్‌ తిరిగి బీఆర్‌ఎ్‌సలోకి వస్తే వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇస్తామని అప్పట్లో బీఆర్‌ఎస్‌ ఆఫర్‌ ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ మారలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వరంగల్‌ నుంచి పోటీ చేసి కడియం కావ్య చేతిలో 2,20,339 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో రమేశ్‌ అంటీముట్టనట్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ రానున్న క్రమంలో బీజేపీ నుంచి బయటకు రావాలని ఆయన అనుచరులు ఆరూరి రమేశ్‌పై ఒత్తిడి తీసుకవచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన రాజీనామా లేఖను పంపించారు. ఈనెల 28న కేసీఆర్‌ సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకొనేందుకు ఆరూరి రమేశ్‌ సిద్ధమయ్యారు.

Updated Date - Jan 27 , 2026 | 03:53 AM