Share News

kumaram bheem asifabad- ప్రతీ రూపాయి లెక్క.. ఇక పక్కా

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:32 PM

పంచాయతీల్లో ప్రజాధనంతో చేపట్టే ప్రతీ ఖర్చుకు జవాబుదారీ తనం మరింత పెరగనుంది. పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం ద్వారా అందనున్న నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీలకు వచ్చే ప్రతీ రూపాయిని నిర్ధేశిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంతో పాటు, ఖర్చు చేసిన నిధులను పక్కా లెక్కలు చూపించాలని స్పష్టం చేసింది. తెలంగాణకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్ల గ్రాంట్ల కేటాయించగా, అందులో 80 శాతం గ్రామ పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించే విధానం ఉంది.

kumaram bheem asifabad- ప్రతీ రూపాయి లెక్క.. ఇక పక్కా
లోగో

- 16వ ఆర్థిక సంఘం నిధుల మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

చింతలమానేపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ప్రజాధనంతో చేపట్టే ప్రతీ ఖర్చుకు జవాబుదారీ తనం మరింత పెరగనుంది. పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం ద్వారా అందనున్న నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీలకు వచ్చే ప్రతీ రూపాయిని నిర్ధేశిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంతో పాటు, ఖర్చు చేసిన నిధులను పక్కా లెక్కలు చూపించాలని స్పష్టం చేసింది. తెలంగాణకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్ల గ్రాంట్ల కేటాయించగా, అందులో 80 శాతం గ్రామ పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించే విధానం ఉంది. 16వ ఆర్థిక సంఘం నిధుల్లో అత్యధికంగా 80 శాతం గ్రామ పంచాయతీలకు దక్కను న్నాయి. గ్రామాల్లో తాగునీటి సరఫరా, రహదారులు, వీధి దీపాల తదితర ప్రజావసరాల పనులకు నిధులను వినియోగించాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్‌లకు పది శాతం చొప్పున కేటాయింపులు చేయడం విశేషం. గ్రామ పంచాతీయకి వచ్చే నిధుల్లో బేసిక్‌ గ్రాంట్స్‌ శాతం టైడ్‌, మిగిలిన ఆన్‌టైడ్‌ గ్రాంట్‌గా ఉంటుంది. పని తీరు ఆధారంగా 50 శాతం అన్‌టైడ్‌ గ్రాంట్‌గా ఉంటుంది. పని తీరు ఆధారంగా మరో 20 శాతం వరకు పర్ఫారెన్స్‌ గ్రాంట్‌ లభించే అవకాశం ఉంటుంది. బేసిక్‌ గ్రాంట్‌లోని టైడ్‌ నిధులను తాగునీటి సరఫరా, నీటి నిర్వహణ, పారిశుద్యం మురికి కాల్వలు, డ్రైనేజీ, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటి పనులకే వినియోగించాల్సి ఉంటుంది. బేస్‌ గ్రాంట్‌లోని ఆన్‌టైడ్‌ నిధులను స్థానిక అసవరాలకు వినియోగించుకోవచ్చు. వీధి దీపాలు, చిన్నపాటి మరమ్మతులు అవసరాలకు సంబంధించిన ఇతర పనులు చేపట్టవచ్చు. ఆన్‌టైడ్‌ నిధుల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 20 శాతానికి మించి ఖర్చు చేయరాదు. దీంతో రోడ్ల పేరుతో అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేసే అవకాశం లేకుండా పరిమితి విఽధించారు.

- ఈ నిధుల ద్వారా..

టైడ్‌ నిధులను నిర్ధేశిత పనులకే ఖర్చు చేయాలి. ప్రతి పనికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనుల ప్రగతికి సంబంధించిన అవసరమైన చోట జియో ట్యాగింగ్‌ చేయాలి. వర్క్‌ ఆర్డర్‌, ఎంబీ, బిల్లులు తదితర రికార్డులను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి. సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆడిట్‌ సమయంలో అభ్యంతరాలు రాకుండా అన్ని రికార్డులు అందుబాటులో ఉంచాలి. నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే తదుపరి విడదల నిధులు విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. గతంలో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా ఆడిట్‌, యూటిలైజేషన్‌ సర్టిఫికేట్లు, ఆన్‌లైన్‌ నమోదులు వంటి అంశాలు కీలకంగా మారాయి. 16వ ఆర్థిక సంఘం నిధుల విషయం లోనూ ఇదే తరహాలో పారదర్శకతను పెద్దపీట వేస్తున్నారు. ఐదేళ్ల పాటు భారీ మొత్తంలో నిధులు అందుబాటులోకి రానుండటంతో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. అయితే నిధులను పక్కదారి పట్టించకుండా, గ్రామ సభల నిర్ణయాలు కేంద్ర మార్గదర్శకాలు అనుగుణంగా ఖర్చు చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శలుపై ఉంది. ప్రతి పనికి సంబంధించిన రికార్డును పకడ్బందీగా నిర్వహించి ప్రతీ రూపాయికి పక్క లెక్క చూపించాల్సి ఉంటుంది.

Updated Date - Sep 11 , 2026 | 11:32 PM