ఫిట్‌నెస్ లేకున్నా..రైట్ రైట్
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:50 PM
విద్యా సంస్థల బస్సుల్లో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. ఫిట్‌నెస్‌లేని బస్సులు నడుపుతూ ప్రాణాల తో చెలగాటం ఆడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బడి బస్సులు..
నామ మాత్రంగా రక్షణ చర్యలు
కొరడా ఝళిపిస్తున్న ఆర్టీఏ అధికారులు
మంచిర్యాల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థల బస్సుల్లో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. ఫిట్‌నెస్‌లేని బస్సులు నడుపుతూ ప్రాణాల తో చెలగాటం ఆడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్న అనేక విద్యా సంస్థల బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఫిట్‌నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నప్పటికీ, ఆ తరువాత పట్టించుకోవడం లే దనే ఆరోపణలున్నాయి. ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ఆరంభం కా నుండగా, ఆ లోపే విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. నూతన విద్యా సంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆర్టీఏ అధి కారులు బస్సుల తనిఖీలు చేపడుతుండగా కోకొల్లలుగా సమస్యలు వెలుగు చూస్తు న్నాయి. జిల్లా వ్యాప్తంగా 370 విద్యా సంస్థల బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 210 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తికాగా, మిగతావి కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. ఫిట్నెస్ కోసం వస్తున్న బస్సుల్లో ముఖ్యంగా అత్యవసర ధ్వారం డోర్లు తెరుచకోకపోవ డం పరిస్థితికి అద్దం పడుతోంది. అలాంటి పరిస్థితుల్లో అత్యవసర ద్వారాన్ని పగుల గొట్టేందుకు సుత్తి అందుబాటులో ఉంచాలి. ఎక్కువ శాతం బస్సుల్లో అవి కానరావడం లేదు. అలాగే మరికొన్ని బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండటం లేదు.
గ్రిల్స్ తప్పనిసరి....
బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపుల తప్పని సరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు చాచకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. గ్రిల్స్ లేని కారణంగా ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయట పెట్టిన పక్షంలో ఇతర వాహణాల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది.
నామ మాత్రంగా ఫైర్ ఎస్టింగిషర్లు.....?
అనుకోని పరిస్థితులలో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సులో మంటలు చెలరేగిన పక్షంలో వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉంది.. అగ్ని మాపక శాఖ నుంచి అనుమతి తీసుకొని బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి. అయితే బస్సులో ఫైర్ ఎస్టింగిషర్స్ కనిపిస్తున్నప్పటికీ, నామ మాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో అవి పని చేస్తాయో...లేదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి.
ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కానరాని పరికరాలు....
విద్యా సంస్థల బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంఽధించి ఎలాంటి పరికరాలు ఉండటం లేదని తెలుస్తోంది. ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో తప్పని సరిగా కాటన్, అయోడిన్, స్పిరిట్ బాటిల్, బ్యాండేజ్ ఉండాలనే నిబంధన ఉంది. బస్సుల్లో తదితర వస్తువులు ఉన్నప్పటికీ అవి కాలం చెల్లి ఉండటం గమనార్హం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్ధులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు విద్యార్ధులు బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డ్రైవరుకు సంబంధించిన పూర్తి వివరాలు.... ఫొటో పేరు, సెల్ నంబర్ విధిగా ప్రదర్శించాలనే ఉండాలనే నిబంధన ఉంది.
ఊసేలేని డ్రైవర్ల మెడికల్ సర్టిఫికేట్లు...
పాఠశాలల బస్సుల్లో పని చేసే డ్రైవర్లకు రెండేళ్లకోసారి వైద్య చికిత్సలు చేయించి మెడికల్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడంలేదని సమాచారం. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు దృవీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఐదేళ్ల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధన కూడా ఉంది. లైట్‌లు, హ్యాండ్ బ్రేక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లు, పసుపుపచ్చ రంగు కలిగి ఉండాలి.
స్టీరింగ్ ప్లే పై ప్రత్యేక ధృష్టి....మంచిర్యాల ఆర్టీవో గోపీకృష్ణ
ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో అధిక శాతం స్టీరింగ్ ప్లే సమస్య ఉంటుంది. ముఖ్యంగా పది సంవత్సరాలు పై బడ్డ బస్సుల్లో సమస్య ప్రమాదకర స్థితిలో ఉండటం గమనిస్తున్నాం. స్టీరింగ్ ప్లే సమస్య వల్ల మూల మలుపుల వద్ద అత్యధికంగా ప్రమాధాలు జరుగుతున్నాయి. బస్సును తిప్పేటప్పుడు స్టీరింగ్ ప్లే కారణంగా డ్రైవర్ లక్ష్యాన్ని చేరడం లేదు. జిల్లాలో మరో 150 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు జరపాల్సి ఉంది. త్వరలోనే అవికూడా పూర్తి చేస్తాం. పూర్తిస్థాయి ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిరిగేందుకు బస్సులకు అనుమతి ఇస్తున్నాం.