Share News

ఈవీ చార్జింగ్‌ కేంద్రాలే లక్ష్యంగా దొంగతనాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:21 AM

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పబ్లిక్‌ చార్జింగ్‌ కేంద్రాలపై దొంగల కన్నుపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చార్జింగ్‌ కేంద్రాలకు రక్షణగా ....

ఈవీ చార్జింగ్‌ కేంద్రాలే లక్ష్యంగా దొంగతనాలు

  • ఏడు చోట్ల గన్‌లు, కేబుళ్లు మాయం

  • కాపలా లేకపోవడమే ఆసరాగా కాపర్‌ వైర్ల చోరీ

  • ఈవీ వాహనదారుల విలవిల

  • దొంగతనం చేస్తే 7ఏళ్ల జైలు.. రెడ్‌కో హెచ్చరిక

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పబ్లిక్‌ చార్జింగ్‌ కేంద్రాలపై దొంగల కన్నుపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చార్జింగ్‌ కేంద్రాలకు రక్షణగా ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అత్యంత విలువైన కాపర్‌ కేబుళ్లను, చార్జింగ్‌ గన్లను దొంగిలిస్తున్నారు. ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, అంబర్‌పేట్‌, అబిడ్స్‌, గాజులరామారం, కూకట్‌పల్లి పరిధిలోని ఏడు చార్జింగ్‌ కేందాలలో ఈ దొంగతనాలు జరిగాయి. ఇందులో నాలుగు చోట్ల ఒకే ముఠాకు చెందిన నలుగురు సభ్యులు ఈ చోరీలకు పాల్పడినట్లు టీజీరెడ్‌కో గుర్తించింది. రెడ్‌కో ఉద్యోగులే దొంగలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్‌ ఈవీ కేంద్రాల్లో యూనిట్‌కు రూ.30 వరకు వసూలు చేస్తుంటే, ప్రభుత్వ పరిధిలోని రెడ్‌కో కేంద్రాల్లో కేవలం రూ.13కే అందిస్తున్నారు. ఎంతో డిమాండ్‌ ఉన్న ఈ తక్కువ ధర కేంద్రాల్లో విలువైన గన్లు, కేబుళ్లు పోతుండడంతో చార్జింగ్‌ స్టేషన్లు మూగబోతున్నాయి. ఫలితంగా ఈవీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో చార్జింగ్‌ కేంద్రాన్ని రెడ్‌కో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఇందులో ఏకకాలంలో రెండు కార్లను చార్జ్‌ చేసుకునేలా (30 కిలోవాట్ల సామర్థ్యం గల) రెండు గన్లు ఉంటాయి. వీటిని దొంగిలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి భారీ గండి పడుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 131 కేంద్రాలు పనిచేస్తుండగా, మరో 19 త్వరలోనే ప్రారంభంకానున్నాయి. యాప్‌ ఆధారంగా నడిచే ఈ కేంద్రాల్లో దొగతనాలకు పాల్పడినా, నష్టం చేకూర్చినా ఊరుకునేది లేదని, ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని రెడ్‌కో హెచ్చరించింది.

Updated Date - Jun 04 , 2026 | 06:21 AM