యూరో ఎగ్జిమ్ బ్యాంకుపై ఆరోపణలకు రుజువులు లేవు
ABN , Publish Date - May 02 , 2026 | 05:40 AM
నకిలీ బ్యాంకు గ్యారెంటీలు జారీచేశారన్న ఆరోపణల వ్యవహారంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది.
ఆధారాలు లేకుండా ప్రసారాలు చేయొద్దు ఆర్టీవీకి కోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): నకిలీ బ్యాంకు గ్యారెంటీలు జారీచేశారన్న ఆరోపణల వ్యవహారంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు జారీచేసిన బ్యాంకు గ్యారెంటీలు మోసపూరితమైనవంటూ చేసిన ఆరోపణలకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆర్‌టీవీ ఎడిటర్ రవిప్రకాశ్, ఆర్‌టీవీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు, ధ్రువీకరణలు లేకుండా యూరో ఎగ్జిమ్ బ్యాంకుపై కథనాలు ప్రసారం చేయకూడదంటూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. రూ. 16 వేల కోట్ల విలువైన ఠాణె- బోరివలి జంట సొరంగాల ప్రాజెక్టు కోసం ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పపెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ)కి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలు నకిలీవని రవిప్రకాశ్ తన మీడియాలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలు చేశారు. దానిని బాంబే హైకోర్టు కొట్టేసింది. కాగా తమపై రవిప్రకాశ్, ఆర్‌టీవీ తప్పుడు ఆరోపణలు చేశారని.. తప్పుడు కథనాలు ప్రసారం చేయకుండా ఇంజెంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ యూరో ఎగ్జిమ్ బ్యాంకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ బ్యాంకుకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.