Share News

పదవుల కోసం పార్టీలు మారను

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:25 AM

పదవుల కోసం తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ‘దివంగత నేత వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏ మంత్రి పదవి కావాలో కోరుకో రాజేంద్రా..

పదవుల కోసం పార్టీలు మారను

  • కేసీఆర్‌ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు

  • అలాంటి పార్టీలోకి నేను వెళతానా?

  • సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం: ఈటల

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పదవుల కోసం తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ‘దివంగత నేత వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏ మంత్రి పదవి కావాలో కోరుకో రాజేంద్రా.. ఇస్తా.. అని పేర్కొంటూ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినా. అదీ నా చిత్తశుద్ధి. కేసీఆర్‌, నన్ను మెడలు పట్టి బీఆర్‌ఎస్‌ నుంచి బర్తరఫ్‌ చేసి ఐదేళ్లవుతుంది. నా వ్యక్తిత్వ హననానికీ పాల్పడ్డారు. తనకున్న అధికార బలంతో రాత్రికిరాత్రి నా వ్యాపార షెడ్‌లను కూలగొట్టించారు. భూములు లాక్కున్నారు. అలాంటి నాయకుడి పార్టీలోకి తిరిగి వెళతానా?’ అని ఈటల ప్రశ్నించారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని తన నివాసంలో ఈటల మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాతో పాటు రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, పొంగులేటి, తుమ్మల, జూపల్లి, జితేందర్‌రెడ్డి అంతా కూడా కేసీఆర్‌ బాధితులే. ఆయన్ను ఓడించేందుకు 2023లో ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అయితే, ఆ వేదిక, కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సరిపోదని భావించాం.. అందుకే వారంతా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. నేను కూడా వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. ఒకవేళ పదవి కోసమే అయితే వారితో పాటు వెళ్తే, ఈపాటికి డిప్యూటీ సీఎం లేదా మంత్రిని అయ్యేవాడిని కదా’ అని ఈటల వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియా వేదికగా తాను బీఆర్‌ఎ్‌సలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ‘నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతున్నట్లు కరీంనగర్‌లో పోస్టర్లు వేశారు. పార్టీలు మారడం, దుస్తులు మార్చుకున్నంత తేలిక కాదు. నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసు. అయినా, కొంతమంది వెకిలి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని తీవ్రంగా విమర్శించారు. న్యాయపరంగా తనకున్న భూములు, ఆస్తులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెరబట్టిందని పేర్కొంటూ, దీనిపై మీ అభిప్రాయమేంటో చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఈటల వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 05:25 AM