Share News

రేవంత్‌ పాలనలో బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:36 AM

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రశాంతత కరువైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు.

రేవంత్‌ పాలనలో బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి

  • పేదల ఇళ్ల కూల్చివేతతో

  • తెలంగాణ సమాజం తలదించుకుంటోంది: ఈటల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రశాంతత కరువైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. ‘ఎప్పుడూ ఎవరి ఇల్లు కూలుస్తారో? ఎవరీ భూములు గుంజుకుంటారో?’ తెలియక జనం బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ లాంటి సీఎంలు గత 70ఏళ్లలో ఉండి ఉంటే.. హైదరాబాద్‌లో వందల బస్తీలు ఎప్పుడో మాయమయ్యేవని ఎద్దేవా చేశారు. ఖమ్మంజిల్లా భూధాన్‌ భూములలో 20ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదల ఇళ్లను ముందస్తు నోటీసులు లేకుండా, 10వేల మంది పోలీసులతో యుద్ధభూమిని తలపించే రీతిలో కూల్చివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ ఘటనతో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, ఆపేరుతో మధురిడ్జ్‌ అపార్ట్‌మెంటు లాంటి వాటిని కూలగొట్టి 500 కుటుంబాలను రోడ్డున పడేయడాన్ని సహించబోమని ఎంపీ ఈటల హెచ్చరించారు. పేదల ఇళ్లకు రక్షణ కరువైందని, వారి జీవితాలతో చెలగాట మాడుతున్న రికార్డు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రూ.5 వేల కోట్లతో గాంధీ పార్కు నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న అరాచకాలను రాహుల్‌గాంధీ అడ్డుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే కాంగ్రె్‌సను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. కాగా, నాణ్యమైన, చవకైన మందులు అందించే ‘ప్రధానమంత్రి జన ఔషదీ కేంద్రాలను’ మరింతగా బలోపేతం చేయాలని కేంద్రప్రభుత్వానికి ఎంపీ ఈటల విన్నవించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:36 AM