Share News

శిథిలావస్థలో ఈఎస్‌ఐ భవనం

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:02 PM

కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థలకు చేరుకుంది. ఈ భవనాన్ని మార్పు చేయాలని గతేడాది ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఉన్నత మండలి కమిటీ స్వయంగా పరిశీలించి ఖాళీ చేయాలని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఇతర చోటుకు మార్చాలని ఉద్దేశంలో పట్టణంలోని పలు భవనాలను పరిశీలించారు. ఇంత వరకు కొలిక్కి రాక పోవడంతో రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యను వేగవంతం చేయాలని అంతా కోరుతున్నారు

శిథిలావస్థలో ఈఎస్‌ఐ భవనం
కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం

- భయాందోళనలో సిబ్బంది

కాగజ్‌నగర్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థలకు చేరుకుంది. ఈ భవనాన్ని మార్పు చేయాలని గతేడాది ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఉన్నత మండలి కమిటీ స్వయంగా పరిశీలించి ఖాళీ చేయాలని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఇతర చోటుకు మార్చాలని ఉద్దేశంలో పట్టణంలోని పలు భవనాలను పరిశీలించారు. ఇంత వరకు కొలిక్కి రాక పోవడంతో రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యను వేగవంతం చేయాలని అంతా కోరుతున్నారు. వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ భవన పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి భవిష్యత్తుపై ఎటు తేలడం లేదు. భవనం కూల్చి మరో భవనం నిర్మిస్తారా..? అనే విషయం ఇంత వరకు స్పష్టత రాకుండా ఉంది. ఈ ఆసుపత్రి ఇక్కడి నుంచి ఎత్తివేస్తే ఈ ప్రాంత కార్మికులకు వైద్య సేవల విషయంలో తీరని అన్యాయం జరిగే అవకాశాలున్నాయని పలు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు నేరుగా ఈఎస్‌ఐ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు. భవన విషయంలో కాగజ్‌నగర్‌లో మూడు ఆసుపత్రిల్లో తరలించేందుకు చర్చలు జరిపినప్పటికీ ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరకు ప్రభుత్వం ఇచ్చే అద్దే ధరకు సరిపోక పోవటం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో పెండింగ్‌లోనే ఈ సమస్య ఏర్పడింది. వర్షా కాలంలో ఈ ఆసుపత్రి ఏం జరుగుతోందో తెలియక ఇటు రోగులు, అటు విధులు నిర్వహించే సిబ్బంది కూడా టెన్షన్‌ పడుతున్నారు.

- ఐదు దశాబ్దాల క్రితం..

కాగజ్‌నగర్‌లో 50 ఏళ్ల క్రితం ఈఎస్‌ఐ ఆసుపత్రి సేవలు ప్రారంభమయ్యాయి. ఇందులో సర్‌సిల్క్‌, ఎస్పీఎం కార్మికులకు వైద్య సేవలను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేలా నిర్ణయిం చారు. కాగా 25 ఏళ్ల క్రితం సర్‌సిల్క్‌ మిల్లు మూత బడింది. 2014లో ఎస్పీఎంను సైతం వివిధ కారణా లతో మూసివేశారు. అప్పటి నుంచి ఈ ఆసుపత్రికి చీకటి రోజులు వచ్చాయి. ఆసుపత్రి భవనం కూడా శిథిలావస్థకు చేరింది. రెండేళ్ల క్రితం ఈ ఆసుపత్రి భవనం పూర్తిగా తొలగించాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు నివేదికలను అందజేశారు. పాత భవనా లన్నీ కూల్చివేస్తే దీన్ని ఎత్తివేస్తారా లేక నూతన భవనం కడుతారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. కాగా ప్రస్తుతం కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లు ఉండడం లేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 19వేల కార్డులు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిగా సేవలు కొనసాగించాలంటే కనీసం 30 వేల కార్డులు అవసరం ఉంటుంది. డిస్పెన్సరీ ద్వారా సేవలు అందిస్తే కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉంటే రాత్రిళ్లు ప్రమాదాలు జరిగితే అడ్మిట్‌ చేసుకునే అవకాశాలుంటాయి. డిస్పెన్సరీలో ఈ అవకాశం ఉండదు. ఒకవేళ ఈఎస్‌ఐ ఆసుపత్రిని కాగజ్‌నగర్‌ నుంచి తరలిస్తే సిబ్బందిని ఎక్కడకు పంపుతారనే విషయంపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 30 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈఎస్‌ఐ ఆసుపత్రిని తొలగించకుండా కొత్త భవనం నిర్మించేందుకు అధికారులు చర్యులు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:02 PM