Share News

kumaram bheem asifabad- మ్యాపింగ్‌లో తప్పిదాలు.. ఓటర్లకు నోటీసులు

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:15 PM

ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో గుర్తించిన తప్పిదాలపై ఎన్నికల యంత్రాంగం దృష్టిసారించింది. 2002 నాటి ఓటర్ల జాబితాలో ప్రస్తుత ఓటర్ల వివరాలను అనుసంధానం చేసే క్రమంలో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 20,929 మంది ఓటర్లు మ్యాపింగ్‌కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు.

kumaram bheem asifabad- మ్యాపింగ్‌లో తప్పిదాలు.. ఓటర్లకు నోటీసులు
నోటీసు అందజేస్తున్న బీఎల్‌వో(ఫైల్‌)

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో గుర్తించిన తప్పిదాలపై ఎన్నికల యంత్రాంగం దృష్టిసారించింది. 2002 నాటి ఓటర్ల జాబితాలో ప్రస్తుత ఓటర్ల వివరాలను అనుసంధానం చేసే క్రమంలో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 20,929 మంది ఓటర్లు మ్యాపింగ్‌కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. మరో 94వేల మంది ఓటర్ల వివరాల్లో పేర్లు, ఇంటిపేర్లు, వయస్సు, తదితర ఆంశాల్లో వ్యత్యాసాలు, పొరపాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు జారీచేసి, హియరింగ్‌కు పిలువనున్నారు. ఒకసారి అటెండ్‌ కాకపోతే రెండోసారి నోటీసు ఇవ్వనున్నారు. దానికి కూడా రాకపోతే ఆ ఓటును తొలగిస్తారు. ఈ మేరకు బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌వో) ఇంటింటికి వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. నోటీసు అందుకున్న ఓటరుతో ఫొటో తీసుకుంటున్నారు. ఫొటోతో పాటు నోటీసు అందజేసిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేలా బీఎల్‌వోలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లు బాధ్యత వహించనున్నారు. కాగా నోటీసులు అందుకున్న ఓటర్లకు ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు హియ రింగ్‌ నిర్వహించనున్నారు. తమ ఓటరు వివరాల్లో ఉన్న తప్పిదాలను సరిచేసుకోవాలనుకునే వారు సంబందిత ఽద్రువపత్రాలతో హియరింగ్‌కు హజరు కావాల్సి ఉంటుంది. ఆధార్‌ తదితర గుర్తింపు, చిరునామా, వయస్సుకు సంబందించిన పత్రాలను తీసుకెళ్లి సరిచేయించుకోవాల్సి ఉంటుంది.

- గ్రామ, వార్డు సభల్లో..

మ్యాపింగ్‌ దూరంగా ఉన్న ఓటర్ల జాబితాను ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో చదివి వినిపిస్తారు. ప్రజల సమక్షంలో వివరాలను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేస్తారు. హియరింగ్‌కు హజరైన వారి గ్రూప్‌ ఫొటోలను సైతం తీసి అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, తదితర చిన్నపాటి తప్పిదాలు ఉంటే బీఎల్‌వోల ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించ నున్నారు. పెద్దస్థాయిలో పరిశీలన అవసరమైన సమస్యలను ఏఈఆర్‌వో, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారి స్థాయికి పంపించి పరిశీలన అనంతరం పరిష్కరించనున్నారు. కాగా ప్రస్తుతం ఓటరు జాబితాలో ఉన్న ఫొటోను మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఫొటో మార్చుకోవాలనుకునే ఓటర్లు బీఎల్‌వోను సంప్రదించాలి. కొత్త ఫొటోతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన అనంతరం కొత్త ఫొటోను ఓటరు జాబితాలో నమోదు చేసే అవకాశం ఉంటుంది.

Updated Date - Aug 23 , 2026 | 10:15 PM